Connect with us

News

Vijayawada: కృష్ణా జలాల పునఃపంపిణీని కేంద్రం వెంటనే నిలుపుదల చేయాలి

Published

on

ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులను కాపాడాలి.. విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడించిన రైతు సంఘాల నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో కృష్ణాజిల్లాల ను పునఃపంపిణీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అధికారం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజేట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశాన్ని ప్రారంభించిన రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులు బ్రిజేష్ కుమార్ తుది తీర్పు పై కేసు పెండింగ్ లో ఉండగానే కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కొరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదానికి దారి తీసేలా గజేట్ విడుదల చేయటం దారుణమని దీన్ని నిలువరించటానికి రాజకీయాలకు అతీతంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, కృష్ణా పరివాహక ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ.. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా విశాఖ రైల్వే జోను, రాజధాని నిర్మాణానికి నిధులు, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు ఇవ్వకపోగా, ఈ రకంగా రాష్ట్రానికి తీవ్రంగా ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అధికారాలు ఇవ్వటం అంటే మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి, నాగార్జునసాగర్, కృష్ణ డెల్టా ఆయకట్టుకు తీవ్రమైన అన్యాయం చేసేందుకే అని స్పష్టంగా తెలుస్తుంది అన్నారు.

సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమలులోనే ఉందని దీని తుది తీర్పు కు లోబడి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా యాజమాన్య బోర్డు దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టిఎంసీలలో ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకునే తాత్కాలిక ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ జరుగుతుందని,కృష్ణా జలాల ట్రిబ్యునల్ అమలు, అన్యాయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఎస్.ఎల్.పీ పెండింగ్ లో ఉండగా చట్ట విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు వాదనలకు అనుకూలంగా ఈ గజేట్ జారీ చేయటం ఆంధ్రప్రదేశ్ రైతులకు గొడ్డలి పెట్టు అన్నారు.ఈ గజెట్ తో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎగువ బాగాన సిడబ్ల్యుసి, అపెక్స్ కౌన్సిల్, కే ఆర్ ఎం బి నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా 105 టీఎంసీల తో విస్తరణ,150 టిఎంసి లతో కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే, శ్రీశైలం దిగు భాగాన అన్ని అనుమతులు ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం,కృష్ణా డెల్టా తో కలిపి మొత్తం 30 లక్షల ఎకరాలకు చుక్క నీరు కూడా రాకుండా బీడుగా మారే ప్రమాదం ఉందని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అప్పర్ భద్రకు రూ. 5,300 కోట్లు కేటాయించి తన రాజకీయ ప్రయోజనాలకోసం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతీసేలా వ్యవహరించిందని, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని తెరమీదకు తెచ్చి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుందని దీన్ని అడ్డుకోవటానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

త్వరలోనే జలవనరుల రంగ నిపుణులు తోను, ఆంధ్ర రాష్ట్ర నది జల వివాదాల నిపుణులతోనూ విజయవాడలో ఒక సమావేశం నిర్వహించి ఈ కృష్ణా జలాల పంపిణీ పై లోతైన అధ్యయనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకుని వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం చేత సుప్రీంకోర్టులో రిట్పిటిషన్ వేసేలా, కేంద్ర ప్రభుత్వం వెంటనే మూడో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించేలా గట్టి ప్రయత్నం చేయాలని ఈశమావేసం లో తీర్మానం చేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలకగా ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు జెట్టి. గురునాథం, రైతు సంఘాల నాయకులు జి.వి రంగారెడ్డి, మిరియం వెంకటేశ్వర్లు, దయా రమాదేవి, ఎం.సుబ్బారావు, ముప్పిరాల శ్రీనివాసరావు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించగా కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు వందన సమర్పణ చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected