అమెరికాలో మరో జాతీయ తెలుగు సంఘం ఏర్పాటైంది. ఒకప్పుడు తెలుగు సంఘాలు (Telugu Associations) అని జనరిక్ గా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఊహించినట్టుగానే అమెరికా అంతటా ప్రత్యేకంగా తెలంగాణ సంఘాలు ఏర్పడితమ పరిధిలో పనిచేస్తున్నాయి.
కొన్ని సిటీ స్థాయిలో మరికొన్ని జాతీయ స్థాయిలో తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాయి. అనంతం కొన్ని నగరాల్లో ఆంధ్ర తెలుగు సంఘాలూ మరియు జాతీయ స్థాయిలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (North America Seema Andhra Association – NASAA) అని ఏర్పడ్డాయి.
ఇప్పుడు అమెరికాలో జాతీయ స్థాయిలో మరో తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఈ తెలుగు సంఘం పేరు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhrapradesh American Association – AAA). పెన్సిల్వేనియా కేంద్రంగా రెండు నెలల క్రితం ఈ తెలుగు సంస్థ రెజిస్ట్రేషన్ జరిగినట్టు తెలిసింది.
కల్చర్ ఎట్ కోర్ అనే ట్యాగ్ లైన్ తో లోగో డిజైన్ చేశారు. లోగోలో భారతదేశం మరియు అమెరికా దేశాల జాతీయ జెండాలను కూడా చెరో వైపుకు ఉంచారు. విభజిత ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలే లక్ష్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
తెలంగాణ సంస్థలు (Telangana Associations) బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రత్యేక పండుగగా ఎలా చేస్తున్నారో AAA వారు కూడా వరలక్ష్మి వ్రతం, సంక్రాంతి వంటి పండుగలను పక్కా సాంప్రదాయక పద్ధతిలో ప్రత్యేకంగా నిర్వహిస్తామంటున్నారు.
ఇందులో భాగంగానే గత వారాంతం జనవరి 21 శనివారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పెన్సిల్వేనియా లోని ఫీనిక్సవిల్ నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ సంస్థ కార్యవర్గాన్ని, అడ్వైజరీ బోర్డ్ ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని మరియు వివిధ సిటీల చాప్టర్ల సభ్యులను పరిచయం చేశారు.
న్యూజెర్సీ ఇంచార్జిగా రవి చిక్కాల, పెన్సిల్వేనియా ఇంచార్జిగా శ్రీనివాస్ ఉప్పల, న్యూజెర్సీ మరో ఇంచార్జిగా శ్రీనివాస్ అడ్డా, నార్త్ కరోలినా ఇంచార్జిగా డా. రాజా శ్రీనివాస్ బొడ్డేపల్లి, డెలావేర్ ఇంచార్జిగా శివశంకర్ చిరుమామిళ్ల, స్టేట్ చాఫ్టర్ల ఇన్సెప్షన్ ఛైర్ గా కళ్యాణ్ కర్రి, మేరీల్యాండ్ ఇంచార్జిగా శ్రీనివాస్ సామినేని ఉన్నారు.
అడ్వైజరీ బోర్డ్ లో ప్రముఖులు రవి మందలపు, శివ పోల, వెంకట కలిదిండి (KVS Raju), వెంకట్ ధనియాల ఉన్నారు. అలాగే 2023-24 కాలానికి భాస్కర్ రెడ్డి కల్లూరి అధ్యక్షునిగా పెన్సిల్వేనియా ఎగ్జిక్యూటివ్ కమిటీని 11 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉండడం అభినందనీయం.
జనవరి 21న నిర్వహించిన సంక్రాంతి సంబరాల సభలో ఈ AAA లీడర్షిప్ సభ్యులందరినీవేదిక పైకి పిలిచి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ యొక్క ఆవశ్యకత మరియు లక్ష్యాలను వివరించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సంస్కృతీ సంప్రదాయాలకి అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలోని వివిధ జాతీయ మరియు స్థానిక తెలుగుసంఘాల నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
ఆ తర్వాతటాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారి ట్రూప్ తో మ్యూజికల్ నైట్ (Musical Night) నిర్వహించారు. వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి (Music Director Koti) తన మెలోడీస్ తో అందరినీ ఉర్రూతలూగించారు. పిల్లలు, పెద్దలు సైతం వేదిక పైకి వెళ్లి మరీ డాన్సులు చేయడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వంటలతో ఆహ్వానితులందరికీ పండుగ భోజనం ఏర్పాటు చేశారు. సుమారు 2500 మందికి పైగా తెలుగువారు హాజరు అయ్యి పండుగ వంటలను, సాంస్కృతిక కార్యక్రమాలను (Cultural Programs), కోటి మ్యూజికల్ నైట్ నిఆస్వాదించారు.
చివరిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన మొట్టమొదటి కార్యక్రమాన్నే అత్యంత విజయవంతం చేసిన ఆహ్వానితులకు, స్పాన్సర్స్ కు, గాయనీగాయకులకు ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.