Published
1 day agoon
By
Sri Nexus
Singapore: శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) గారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ (Ratna Kumar Kavuturu) అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే శ్రీ వెంకయ్య నాయుడు గారి ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు.

కుటుంబంతో నాలుగు రోజుల విహారయాత్రగా సింగపూరు (Singapore) కు వచ్చినప్పటికీ, తమ అభ్యర్థన మేరకు తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకయ్య నాయుడు గారి ఆశీర్వాదాలు సింగపూరు తెలుగు సమాజంపై, అలాగే శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ (Sri Samskrutika Kalasaradhi) పై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు (Singapore) భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది.

మనం ఐక్యంగా లేకపోబట్టే చరిత్రలో చిన్న చిన్న దేశాలు కూడా వచ్చిన మనల్ని ఆక్రమించి తిష్టవేశాయి. మన సంపదను దోచుకువెళ్లాయి. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోటే అభివృద్ధి సాధ్యం. ’’ అని శ్రీ వెంకయ్యనాయుడు (Muppavarapu Venkaiah Naidu) స్పష్టం చేశారు.
సింగపూర్ (Singapore) వంటి దేశాలు మనవారిని ఆదరించి అవకాశాలు కల్పిస్తున్నాయని, ఏ దేశంలో ఉన్నా అక్కడి నిబంధనలను, పద్ధతులను గౌరవించాలని శ్రీ వెంకయ్యనాయుడు సూచించారు. అదే సమయంలో మన మూలాలను మరిచిపోకూడదని చెప్పారు. ‘‘మన సంస్కృతి, మన భాష, మన యాస, మన కట్టు, మన బొట్టు, మన సంప్రదాయాలను మరచిపోకూడదు.

కుటుంబ వ్యవస్థే మన బలం. ప్రపంచమంతా మనల్ని గౌరవిస్తోంది మన కుటుంబ వ్యవస్థను చూసే. దాన్ని కాపాడుకోవాలి. మన సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించాలి.’’ అని Muppavarapu Venkaiah Naidu పిలుపునిచ్చారు. పాశ్చాత్య సంస్కృతి, ఎలక్ట్రానిక్ పరికరాల వ్యామోహంలో పడి కుటుంబాన్ని విస్మరించవద్దని సూచించారు.
ముఖ్యంగా పిల్లలు తమ అమ్మమ్మలు, తాతయ్యలతో సమయం గడపాలని, వారి నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. పెద్దలు కూడా పిల్లలతో తగినంత సమయం గడపాలని సూచించారు. “భాష పోతే శ్వాస పోతుంది” అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు (Muppavarapu Venkaiah Naidu) నొక్కి చెప్పారు.

తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని (Literature) ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించాలని, సూర్యోదయానికే నిద్రలేవాలని, వ్యాయామం, యోగా చేయడం ద్వారా మనసు, శరీరం అదుపులో ఉంటాయని తెలిపారు. సిరిధాన్యాలు, సంప్రదాయ వంటకాలే మనకు బలమని, పిల్లలకు మన రుచులను అలవాటు చేయాలని సూచించారు.
టీవీలకు అతుక్కుపోకుండా క్రీడలు, సంగీతం వంటి కళల్లో పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. సూర్యాస్తమయానికల్లా పనులు ముగించుకోవాలన్నారు. పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావని, అవి ఐక్యతకు గొప్ప వేదికలని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రపంచ జీడీపీలో పావు వంతు వాటా కలిగిన భారత్ (India), పరాయి పాలనలో దోపిడీకి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

మన అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి వంటి వీరుల చరిత్రను నేటి తరానికి తెలియజేయాలన్నారు. మన మహనీయుల గొప్పతనాన్ని దాచి, పాశ్చాత్య వ్యక్తులు కొంతమందిని గొప్పవారిగా చరిత్రలో చిత్రీకరించారని, అందరినీ దోచుకుని, చంపుకుంటూ వెళ్లిన వారు గొప్పవారు ఎలా అవుతారని శ్రీ వెంకయ్యనాయుడు (Muppavarapu Venkaiah Naidu) అన్నారు.
చరిత్ర పుస్తకాల్లోని వక్రీకరణలను సరి చేసి మన మహనీయుల గురించి నేటితరానికి తెలియచేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ (India) లో ఎన్నికల ప్రక్రియను వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. ఓడితే ఈవీఎంల తప్పు అంటున్న కొంతమంది.. అదే ఈవీఎంల ద్వారా గెలిచినప్పుడు వాటిని తప్పుబట్టడం లేదని విమర్శించారు.

భారత ఆర్థిక వ్యవస్థపై అవాంఛిత వ్యాఖ్యలు చేసేవారికి మన అభివృద్ధి ద్వారానే ప్రధాని మోదీ (Narendra Modi) తగిన సమాధానం చెబుతున్నారని అన్నారు. భారత్ మళ్లీ ‘విశ్వగురువు’ కావాలని, అది జ్ఞానాన్ని పంచడానికే తప్ప ఆక్రమణల కోసం కాదని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) వినియోగాన్ని ఆపలేమని, అయితే దాని దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సామాజిక సంతోషానికి కొన్ని కఠిన నిబంధనలు, నియంత్రణలు అవసరమని, అందుకే సింగపూర్ తనకు నచ్చుతుందని అన్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ (Telangana) కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం (Telugudesam) ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.

తదుపరి కార్యక్రమానికి హాల్‌ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) మరియు నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.
























