Connect with us

Literary

గ్రంథాలయాల తీరు తెన్నులపై ఆసక్తికరమైన చర్చ: తానా ప్రపంచ సాహిత్య వేదిక

Published

on

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 30 న అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం లో నిర్వహించిన “తెలుగునాట నాటి గ్రంథాలయోద్యమం – నేటి గ్రంథాలయాల పరి(దు)స్థితి” అనే 41 వ సాహిత్య కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులందరకూ స్వాగతం, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న వివిధ ప్రసార మాధ్యమాలకు ముందుగా మా హార్దిక కృతజ్ఞతలు అంటూ సభను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డా. అయాచితం శ్రీధర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు లు ముఖ్య అతిథులు గా హాజరై ఇరు రాష్ట్రాలలో గ్రంథాలయరంగాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు.

విశిష్ట అతిథులుగా – అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం – గుంటూరు, వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణ; గాడిచర్ల ఫౌండేషన్ – కర్నూలు, అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర; శ్రీ రాజరాజ నరేంద్రాంద్ర భాషానిలయం – వరంగల్, కార్యదర్శి కుందావజ్జుల కృష్ణమూర్తి; సర్వోత్తమ గ్రంథాలయం – విజయవాడ, కార్యదర్శి డా. రావి శారద; శారదా గ్రంథాలయం – అనకాపల్లి, అధ్యక్షులు కోరుకొండ బుచ్చిరాజు; శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషానిలయం – హైదరాబాద్, గౌరవ కార్యదర్శి తిరునగరి ఉడయవర్లు; సి. పి. బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం – కడప నిర్వాహకులు డా. మూల మల్లిఖార్జున రెడ్డి; విశాఖపట్నం ఫౌర గ్రంథాలయం – విశాఖపట్నం, గ్రంథాలయాధికారి ఎం. దుర్గేశ్వర రాణి; సారస్వత నికేతనం గ్రంథాలయం – వేటపాలెం నిర్వాహకులు కె, శ్రీనివాసరావు; గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం – రాజమహేంద్రవరం అభివృద్ధి కారకులు డా. అరిపిరాల నారాయణ గార్లు తమ తమ గ్రంథాలయాల స్థాపన, వాటి చరిత్ర, వర్తమాన స్థితి, ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వ సహకారలేమి, ఎదుర్కుంటున్న సవాళ్ళు, భవిష్య ప్రణాళిక మొదలైన అంశాలను సోదాహరణంగా వివరించారు. 

తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ –  “తెలుగునాట నాటి గ్రంథాలయోద్యమం – నేటి గ్రంథాలయాల పరి(దు)స్థితి” అనే అంశంపై చర్చ ఈనాడు చాలా అవసరం అని, నేటి గ్రంథాలయాలే రేపటి తరాలకు విజ్ఞాన భాండాగారాలని, వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా, పరిరక్షించి, పెంపొందించే క్రమంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపి అవసరమైన నిధులు సమకూర్చాలని, దీనికి వివిధ సాహితీ సంస్థల, ప్రజల సహకారం, మరీ ముఖ్యంగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి ప్రవాస భారతీయల వితరణ తోడైతే అద్భుతాలు సృస్టించవచ్చని అన్నారు”.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected