Connect with us

Cricket

తానా జండాని ఇండియాలో రెపరెపలాడించనున్న శశాంక్, దక్షిణ భారత దేశ దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ కి శ్రీకారం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ యువతేజం శశాంక్ యార్లగడ్డ గత జనవరి 5, 6 తేదీల్లో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జట్లతో వికలాంగుల క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇంకో మెట్టు పైకెక్కి దక్షిణ భారత దేశ స్థాయిలో దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ కి శ్రీకారం చుట్టారీ తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ. ‘డిఫరెంట్లీ ఏబుల్డ్ వీల్ ఛైర్ సౌత్ ఇండియా క్రికెట్ కప్’ పేరుతో విశాఖపట్నంలో డిసెంబర్ 10 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్ వీల్ ఛైర్ అండ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో 4 రోజులపాటు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గీతం (GITAM) యూనివర్సిటీ క్రికెట్ స్టేడియం ఈ టోర్నమెంట్ కి వేదిక కానుంది.

సరిగ్గా తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు నిర్వహించే డిసెంబర్ నెలలోనే కాబట్టి తానా నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఈ సౌత్ ఇండియా దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్లో (Differently abled Wheelchair South India Cricket Cup) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల జట్లు పాల్గొననున్నాయి.

Shashank Yarlagadda
TANA Sports Coordinator

ఇలా పలు దక్షిణ భారత రాష్ట్రాల ఆటగాళ్లతో మరియు వాళ్ళ క్రికెట్ సంఘాలతో అన్ని విషయాలలోనూ సమన్వయం చేసుకుంటూ అందునా దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహించడం తానా (Telugu Association of North America) 45 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి. ఈ విషయంలో మాత్రం శశాంక్ యార్లగడ్డ ని తప్పకుండా అభినందించాల్సిందే.

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టం లోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు వంటి పలు జిల్లాలలో క్రికెట్ క్యాంపులు నిర్వహించి, కొత్త ఆటగాళ్లలో ఉన్న టాలెంట్ ని వెలికితీసి, వారికి ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆడే అవకాశాన్ని కల్పించనున్నారు. దీంతో ఆయా జిల్లాల దివ్యంగులలో ఉత్సాహం పెల్లుబికింది.

ఇప్పటి వరకు ఎన్నో కొత్త క్రీడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ఇప్పుడు తానా జండా ఇండియాలో రెపరెపలాడేలా లార్జర్ దాన్ లైఫ్ తరహాలో దక్షిణ భారత దేశ స్థాయిలో దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడాన్ని చూసి ఇటు అమెరికా అటు ఇండియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ దక్షిణ భారత దేశ దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ కి తమ వంతుగా తోడ్పడాలనుకునే వారు తానా ఫండ్రైజర్ ద్వారా తోచినంత సహాయం చేయవలసిందిగా తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ (Shashank Yarlagadda) కోరుతున్నారు.

ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, అలాగే తానా ఆదరణ (TANA Aadarana) ప్రాజెక్ట్ సమన్వయకర్త రవి సామినేని ల సహకారం మరువలేనిది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected