భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు పలు ఉపకరణాలు అందించారు. కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్తుతుల వల్లనే కాకుండా గురువులు విద్యార్థులకు చక్కని సాంకేతిక నైపుణ్యం ద్వారా విద్యాబోధన చేసేలా గేట్స్ వారు ఈ సహాయం చేశారు.
రెండు వేర్వేరు పాఠశాలల్లో నిర్వహించిన భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గేట్స్ తరపున ఈ సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గేట్స్ అధ్యక్షులు సునీల్ గోటూర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తమలో కూడా చాలామంది పట్టుకొమ్మలైన పల్లెసీమల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఈ స్థాయికి వచ్చామని, మూలాలు తెలుసుకాబట్టే బ్యాక్ హోమ్ ఈ ప్రాజెక్ట్స్ చేపట్టామని అన్నారు.
మొదటిగా మహబూబ్ నగర్ జిల్లా, కొందుర్గు మండలం, రేగడి చిల్కమర్రి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలకు డిజిటల్ పద్ధతి ద్వారా విద్యనందించేలా స్మార్ట్ టీవీని బహుకరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా తమ పాఠశాలను గుర్తు పెట్టుకొని సహాయం చేసినందుకు సునీల్ గోటూర్ మరియు ప్రభాకర్ మడుపతి సారధ్యంలోని గేట్స్ నాయకులను పాఠశాల సిబ్బందికొనియాడారు.
అలాగే రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్ నగర్ మండలం, చించోడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విజ్ఞాన శాస్త్ర పరికరాలను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సైన్స్ టీచర్స్ తమ ఆనందాన్ని తెలియపరచి గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ కార్యవర్గ మరియు బోర్డు సభ్యులను అభినందించారు.
ఈ గేట్స్ సహాయం గురించి తెలుసుకున్న మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు వారు ప్రయోగశాలల సామాగ్రి వంటి వాటిని డొనేట్ చేయమని అడుగుతున్నారు. కావున మనం పుట్టిపెరిగి చదువుకొని వచ్చిన బ్యాక్ హోమ్ పాఠశాలలకు తమకు తోచినంత సహాయం చేయడానికి ముందుకు రావలసిందిగా కోరుతున్నారు గేట్స్ వారు.
డొనేషన్స్ చేయదలచిన వారు గేట్స్ వెబ్సైట్ www.gatesusa.org ని సందర్శించండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేసి ఉన్నత స్థాయికి చేరుకునేలా భావితరానికి చేయూతనిస్తున్న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ సభ్యులను ఇటు అమెరికా అటు తెలంగాణ రాష్ట్ర వాసులు అభినందిస్తున్నారు.