గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆగష్టు 21వ తేదీన జార్జియా రాష్ట్రం, బ్యూఫోర్డ్ పట్టణంలోని లేక్ లేనియెర్ డ్యామ్ నదీ పరివాహక ప్రాంతంలో వనభోజనాలు ఏర్పాటుచేశారు. 1000 మందికి పైగా హాజరైన ఆహ్వానితులకు జిహ్వ చాపల్యం తీరేలా అసలు సిసలు తెలంగాణ వంటకాలను వడ్డించారు.
ముప్పై మంది గేట్స్ వాలంటీర్స్ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నలభీమ పాకాలను తయారుచేయగా తిని తరించడం అట్లాంటా తెలుగువారి వంతు అయింది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, గ్రిల్ చికెన్, గ్రిల్ కార్న్, సాంబార్, ఆలు కుర్మ, పచ్చి పులుసు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, గులాబ్జామ్ ఇలా ఎన్నో వంటకాలను ప్రత్యేకంగా వండి వార్చారు.
గేట్స్ వనభోజనాలకి విచ్చేసిన రెండు తెలుగు రాష్ట్రాల వారికి సరదా సరదాగా ఆట పాటలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యంగా బింగో, స్పూను నిమ్మకాయ, శాక్ రేస్, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆస్వాదించారు.
విపరీతమైన జనం రావడంతో వడ్డించేవారు వడ్డిస్తుండగానే మరోవైపు వేడి వేడి వంటకాలను మళ్ళీ తయారుచేశారు. బిర్యానీ పాట్ రెస్టారెంట్ వారు జీరా రైస్ స్పాన్సర్ చేశారు. ఇండియాలో వలే చక్కని పల్లె వాతావరణంలో వనభోజనాలు నిర్వహించినట్లుందని ఆహ్వానితులు గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ కార్యవర్గాన్ని అభినందించడం విశేషం.
ఈ కార్యక్రమ నిర్వహణలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అధ్యక్షులు సునీల్ గోటూర్ గారు, చైర్మన్ ప్రభాకర్ మడుపతి గారు, ఉపాధ్యక్షులు జనార్దన్ పన్నెల గారు, కార్యదర్శి శ్రీని పర్సా గారు, కోశాధికారి సందీప్ గుండ్ల గారు, సాంస్కృతిక కార్యదర్శి నవీన్ బత్తిని గారు, సాంకేతిక కార్యదర్శి రమణ గండ్ర గారు, ఈవెంట్ సెక్రటరీ చలపతి వెన్నమనేని గారు, మీడియా కార్యదర్శి గణేష్ కాసం గారు, క్రీడా కార్యదర్శి కీర్తిధర్ గౌడ్ చక్కిల గారు ముందున్నారు.
అలాగే బోర్డు డైరెక్టర్లు కిషన్ తాళ్లపల్లి గారు, రామాచారి గారు, నవీన్ ఉజ్జిని గారు, రఘువీర్ రెడ్డి గాడిపల్లి గారు, జ్యోత్స్న పాలకుర్తి గారు, అడ్వైజరి మెంబర్స్, వివిధ కమిటీలకు సంబందించిన చైర్స్, కోచైర్స్ మరియు గేట్స్ వాలంటీర్స్ అంకితభావంతో పనిచేసి గేట్స్ వనభోజనాలను ఎప్పటిలానే విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వాలంటీర్స్ అనిల్ కుశ్నపల్లి, అశోక్ పల్లా, అరుణ్ కావేటి, మధు నంబేటి, రామకృష్ణ గండ్ర, రవీందర్ దాసరపు, శ్రీధర్ గంగాధరి, సుమన్ గుర్రపు, శరత్ గండ్ర, విజయ్ కుమార్ వింజమర, బాలనారాయణ మద్ద, రామకృష్ణ బట్టు, శ్రీకాంత్ మాదారపు, నంద చాట్ల తదితరులను గేట్స్ కార్యవర్గం అభినందించింది.