చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం మూడవ రోజులో భాగంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆగష్టు 17న భక్తి పారవశ్యంతో వేద పండితులు వైభవంగా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కొలిచారు.
ఉదయం చతుర్వేద పారాయణ, చతుర్వేద హవనం, కలశాధారణ, నీరాజన మంత్రపుష్పం మొదలగు పూజలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం విమాన గోపుర నూతన కలశం శివాలయం నుండి మాడా వీధుల్లో ప్రదక్షణ తీసుకొని వచ్చి ప్రధాన ఆలయం యాగశాల పూజల యందు ఉంచడం జరిగింది.
అనంతరంయాగశాల నందు అనుజ్ఞ, ప్రవేశ బలి, రచ్చోగ్య హోమము, వాస్తు శాంతి, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ ఎమ్మెస్ బాబు గారు, దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం కార్యనిర్వహణధికార శ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు.
అలాగే ఆలయ పునర్నిర్మాణ దాతలు శ్రీనివాస్ గుత్తికొండ గారు, రవి ఐకా గారు మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఈఈ వెంకట నారాయణ, ఏఈఓ లు విద్యాసాగర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, ఆలయ పర్యవేక్షకులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పూజల్లో లీనమయ్యారు.