ఏప్రిల్ 28న అమెరికాలోని డల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల ద్వారా తమ భవనానికి నిధుల సమీకరణకు తెరదీశారు. కానీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అంశాల్లో భాజపా సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ వంచనతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతున్న తరుణంలో కనీసం బాధ్యతాయుతంగా ప్రవర్తించని చిరంజీవి సారధ్యంలోని మా నటీనటులకు డల్లాస్ ప్రవాసాంధ్రులు నిరసనలతో స్వాగతం పలికారు. నల్లని దుస్తులతో ప్లకార్డ్స్ పట్టుకొని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, సినీ పరిశ్రమ డౌన్ డౌన్, ఏపీ డిమాండ్స్ జస్టిస్ వంటి స్లొగన్స్ తో అట్టుడికించారు. మీ సినిమా టికెట్స్ అత్యంత భారీ ధరలకు కొని సంపన్నులను చేస్తే మీరేమో ప్రజల పక్షాన పోరాడ కుండా ఎవరితో లాలూచీపడుతున్నారని ప్రశ్నించారు. మీడియా విషయంలో సినీ పరిశ్రమ మొత్తం ఒకటై వస్తే మరి ప్రత్యేక హోదా విషయంలో ఒకతాటి పైకి ఎందుకు రాలేకపోయారని నిలదీశారు. తమిళనాడు నటీనటులను చూసి సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకారమందించాలని కోరారు. విశేషమేమిటంటే పార్టీలకతీతంగా డల్లాస్ ప్రవాసాంధ్రులందరూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడంతో ఏప్రిల్ 27న జరిగిన బాంక్వెట్ డిన్నర్, ఏప్రిల్ 28న జరిగిన మెయిన్ ఈవెంట్ కూడా విలవిల పోయాయి.