ఏప్రిల్ 7న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ‘జిడబ్ల్యుటిసిఎస్’ ఉగాది వేడుకలు అమెరికాలోని వాషింగ్టన్ లో దేదీప్యమానంగా జరిగాయి. 44 సంవత్సరాల బృహత్తర అనుభవ సంస్థ అయిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 1000 మందికి పైగా వాషింగ్టన్ పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. స్థానిక స్టోన్ బ్రిడ్జ్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ముందుగా స్వాగతోపన్యాసంతో మొదలైన ఈ వేడుకలలో భాగంగా ప్రదర్శించిన సినీ, జానపద, శాస్త్రీయ నృత్యాలు, పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సినీ కళాకారులు శివా రెడ్డి మిమిక్రీ, తెలుగు సినీ తార అనిషా ఆంబ్రోస్ ప్రదర్శన, ఇంద్రజాలం ప్రదర్శన ప్రేక్షకులను మైమరపించాయి. తెలుగు సినీ వ్యాఖ్యాత అశ్విని శర్మ వ్యాఖ్యానంతో కార్యక్రమమంతా సరదా సరదాగా సాగింది. మధ్యలో జిడబ్ల్యుటిసిఎస్ అధ్యక్షులు సత్యనారాయణ మన్నె గారు తమ కార్యవర్గాన్ని సభకు పరిచయం చేసారు. అలాగే స్పాన్సర్లను, సినీ కళాకారులను శాలువా మరియు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ వేడుకలలో పాల్గొన్న పాఠశాల సి.ఇ.ఓ చెన్నూరి సుబ్బారావు గారు జిడబ్ల్యుటిసిఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు విందు భోజనాలు రుచికరంగా ఉన్నాయని ఆహుతులు అభినందించారు. చివరిగా ఈ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేసిన ఆహుతులకు మనస్ఫూర్తిగా కార్యవర్గం తరపున కృతఙ్ఞతలు తెలియజేసారు.