ఏప్రిల్ 7న టెన్నెస్సీ తెలుగు సమితి ఉగాది సంబరాలు వేడుకగా జరిగాయి. నాష్విల్ లోని ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో నిర్వహించిన ఈ ఉగాది సంబరాలకు డాక్టర్ దీపక్ రెడ్డి, డాక్టర్ జితేందర్ కట్కూరి మరియు శారద కట్కూరి సమర్పకులుగా వ్యవహరించారు. స్థానిక తెలుగు వారు సుమారు 600 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొనడం విశేషం.
టెన్నెస్సీ లోని నాష్విల్ సంగీత నగరంగా పేరొందడం అందరికీ తెలిసిందే. మరి ఆ సంగీత నగరంలో మన ప్రముఖ తెలుగు సినీ కోయిల సునీత అడుగెడితే, రాగం అందుకుంటే ఎలా ఉంటుందో చెప్పాల్సినవసరంలేదు. సునీతతో పాటు మాటీవీ సూపర్ సింగర్ ఫేమ్ గాయకులు దినకర్ కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. ముందుగా టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల స్వాగతోపన్యాసం చేస్తూ అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. పంచాంగ శ్రవణంతో కార్యక్రమం మొదలవగా, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన భరతనాట్యం, సినీ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
తదనంతరం గాయనీ గాయకులు సునీత, దినకర్ లను వేదికమీదకు ఆహ్వానించగా ప్రేక్షకులు బహుపరాక్ బహుపరాక్ అంటూ స్వాగతం పలికారు. మైకు అందుకున్న వెంటనే తమను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గానికి కృతఘ్నతలు తెలియజేసి, క్లాసిక్ పాటలతో మొదలుపెట్టి జానపద, సాంఘిక, ఫాస్ట్ బీట్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది. తర్వాత స్పాన్సర్స్ ని, సునీత, దినకర్ లను పుష్ప గుచ్ఛం, శాలువా మరియు జ్ఞాపికలతో టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం ఘనంగా సన్మానించారు. మధ్య మధ్యలో రాఫుల్ డ్రాల్లో విజేతలకు ఉప్పాడ పట్టుచీరలు, ముత్యాల నగలు వంటి విలువైన బహుమతులు గాయని సునీత చేతులమీదుగా అందజేశారు.
టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ ఈ ఉగాది సంబరాలకు వెన్నంటి ఉండి తమ పూర్తి సహకారం అందించిన కార్యదర్శి కిరణ్ కామతం, సాంస్కృతిక కార్యదర్శి ప్రశాంతి చిగురుపాటి, ఫుడ్ కమిటీ లీడ్ నిషిత కాకాని, రిజిస్ట్రేషన్ కమిటీ లీడ్ రజని కాకి, ఇతర కమిటి సభ్యులు, అడ్వైసరీ కమిటీ మరియు యూత్ కమిటి సభ్యులు, అలాగే విజయవంతంచేసిన ప్రేక్షకులు, స్పాన్సర్స్, తమ పాటలతో అందరిని ఆహ్లాదపరచిన సునీత, దినకర్, ఆడియో & లైటింగ్ అందించిన డి.జె. శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్, వేదికనందించిన ఫాదర్ ర్యాన్ ఆడిటోరియం యాజమాన్యం, వేదికను చక్కగా అలంకరించిన డాజిల్ ఈవెంట్స్, రుచికరమైన విందు బోజనాలను అందించిన పారడైస్ బిర్యానీ ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఉగాది సంబరాలను ముగించారు. మొత్తంగా సంగీత నగరంగా పిలవబడే నాశ్విల్ లో తెలుగు సినీ కోయిల సునీత సంగీత విభావరి బహుపరాక్ అన్నమాట.