తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే పసుపు సైనికుల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నతమైన విలువలతో కూడిన పార్టీ నిర్వహించే మేధోమధనం లాంటి కార్యక్రమం కనుక. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు మరియు కార్యకర్తలు అందరూ తరలివస్తారు.
ఇప్పుడు అదే ఉత్సాహం అమెరికాలో కూడా వ్యాపించింది. ఎన్నారై టీడీపీ సభ్యులు ఇంతకు మునుపే 2018 లో టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో విజయవంతంగా మహానాడు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. కోవిడ్ అనంతరం మళ్ళీ అదే ఉత్సాహం, కార్యదక్షతతో ఈ సంవత్సరం బోస్టన్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు మే 20, 21న రెండు రోజులపాటు ఘనంగానిర్వహించాలని తలచారు.
దీనికి సంబంధించి ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమయ్యారు. తమ నగరంలో చేయడానికి పలు నగరాల నాయకులు ముందుకు వచ్చినట్టు తెలిసింది. చివరిగా ఏప్రిల్ 15 గురువారం రోజున జరిగిన ఆన్లైన్ సమావేశంలో సమైఖ్యంగా అందరూ మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరాన్ని ఖరారు చేసారు. తెలుగుదేశం పార్టీ 40వ వసంతంలో జరగనున్న మహానాడు కనుక ఎన్నారై టీడీపీ బోస్టన్ సభ్యులు అమెరికాలోని మిగతా నగరాల ఎన్నారై టీడీపీ సభ్యుల సహకారంతో చాలా పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.