Rockville, Maryland: వాషింగ్టన్ డీసీ (Washington D.C.) రాజధాని ప్రాంతంలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, క్రీడలు మరియు సేవా రంగాలలో విశేష సేవలందిస్తున్న రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) 2026–2027 సంవత్సరాలకు ఎన్నికైన నూతన కార్యనిర్వాహక బృందాన్ని జనవరి 24న, మేరీల్యాండ్ రాష్ట్రం రాక్విల్లే నగరంలో నిర్వహించిన బోర్డు సమావేశంలో అధికారికంగా ప్రకటించింది.
ఈ సమావేశంలో శ్రీ పార్థ బైరెడ్డి గారు సంఘం అధ్యక్షునిగా (Chairperson / President) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) వ్యవస్థాపకులు శ్రీ రామ్మోహన్ కొండా (RamMohan Reddy Konda) గారు, శ్రీ చిత్తరంజన్ నల్లు గారు, ట్రస్టీలు, అడ్వైజర్లు మరియు మాజీ అధ్యక్షులు శ్రీ గోపాల్ నున్న గారు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.
అధ్యక్షులు పార్థ బైరెడ్డి (Partha Byreddy) గారు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (Capitol Area Telugu Society – CATS) వంటి ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం తనకు గౌరవంగా ఉందని తెలిపారు. ఉత్తర అమెరికాలో విశిష్ట గుర్తింపు పొందిన ఈ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను తనపై ఉంచిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంతో పాటు కార్యవర్గ సభ్యుల సహకారంతో, నూతన కార్యక్రమాలను ప్రవేశపెడుతూ రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (Capitol Area Telugu Society – CATS) సంస్థ అభివృద్ధి దిశగా సమిష్టిగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.
మాజీ అధ్యక్షుడు గోపాల్ నున్న (Gopal Nunna) గారు మాట్లాడుతూ.. తన హయం లో కన్నా ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలను చేపట్టి సంస్థను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ కార్యకలాపాలకు మార్గనిర్దేశకులుగా శ్రీ భాస్కర్ బొమ్మారెడ్డి గారు, శ్రీ సుదర్శన దేవిరెడ్డి గారు, మరియు శ్రీ రామ యారుబండి గారు సేవలందిస్తున్నారు.
నూతన కార్యనిర్వాహక బృందం
శ్రీ పార్థ బైరెడ్డి గారు – ప్రెసిడెంట్ (President)
శ్రీ రమణ మద్దికుంట గారు – వైస్ ప్రెసిడెంట్ (Vice President)
శ్రీ రంగస్వామి రెడ్డి సూర గారు – జనరల్ సెక్రటరీ (Exec Director – Compliance)
శ్రీ లక్ష్మీకాంత్ జి. వెంకట గారు – ట్రెజరర్ (Exec Director – Finance)
శ్రీమతి శిరీష కొల్ల గారు – సాంస్కృతిక కార్యదర్శి (Exec Director – Cultural)
శ్రీ మహేష్ అనంతోజ్ గారు – చారిటీస్ & కమ్యూనిటీ వ్యవహారాల కార్యదర్శి (Exec Director – Charity & Community Affairs)
ముఖ్య అతిథిగా శ్రీమతి మాధవి లత కొంపెల్ల (Madhavi Latha Kompella) గారు కార్యక్రమానికి విచ్చేసి, మంత్రోచ్చారణలతో నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించారు. అలనాటి శ్రీరాముని పరిపాలనలా ధర్మం, న్యాయం, సేవా భావంతో CATS నూతన కార్యవర్గం పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ATA అధ్యక్షులు శ్రీ జయంత్ చల్లా (Jayanth Challa) గారు & టీం కూడా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (Capitol Area Telugu Society – CATS) నూతన కార్యనిర్వాహక బృందం నాయకత్వంలో భాషా, సాంస్కృతిక మరియు సామాజిక సేవా రంగాలలో తన కార్యకలాపాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని CATS సంఘ సభ్యులు వ్యక్తం చేశారు.