యాభయేళ్ల స్వర్ణోత్సవ సంస్థ తానా (TANA) కు పునాదులైన మాతృభాష, సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువెత్తు అద్దం పడుతూ చిన్నారులు, యువత, వారి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో తానా పాఠశాల వేదికగా ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ‘తెలుగు భారతికి వెలుగు హారతి’ కార్యక్రమం బహు విజయవంతం అయ్యింది.
ఏ దేశ మేగినా ప్రవాస సంఘ వేదికల అంతిమ లక్ష్యం భాష, ఐక్యత, పురోగతి అంటూ సుమారు ఏడు గంటలపాటు నిరంతరంగా 80 మందికిపైగా చిన్నారుల ప్రాతినిధ్యంతో శ్లోకం, పద్యం, కథ, గేయం ఇలా పలు విభాగాలలో లబ్దప్రతిష్ఠులైన అతిధుల, కార్యవర్గ సమక్షంలో ఈ అపురూప కార్యక్రమం సాగింది.
అన్నమయ్య కీర్తనలు, నీతి కథలు, శ్లోకం, తెలుగువారికి మాత్రమే సొంతం అయిన పద్యం, భావం తానా పాఠశాల చిన్నారులు చెప్తుంటే ఉపాధ్యాయులు, తానా (TANA) కార్యవర్గ సభ్యులు, అతిథులు, తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా వినడం విశేషం.
తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali), కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi), మాజీ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర పర్యవేక్షణలో తానా పాఠశాల ఛైర్మన్ భానుప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) సారధ్యంలో చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించారనడంలో ఎటువంటి సందేహం లేదు.
భాషా కోవిదులు, గౌరవనీయులు సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) గారు మరియు ఎల్ వి గంగాధర శాస్త్రి (Dr. Lakkavajhala Venkata Gangadhara Sastry) గారు చిన్నారులను ఆశీర్వదించి అద్భుతమైన తేనెలొలికే కార్యక్రమం నిర్వహించారంటూ అందరినీ కొనియాడారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు.