Tirupati, Andhra Pradesh: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న అన్నమయ్య సంకీర్తనల ప్రచార కార్యక్రమంలో డిసెంబర్ 12, 2025న స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) సంస్థ వారు పాలుపంచుకున్నారు.
అన్నమాచార్య ప్రాజెక్టు (Annamacharya Project) ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీ మేడసాని మోహన్ గారి ఆశీస్సులతో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షురాలు గురు శ్రీమతి శేషుకుమారి (Seshu Mudiganti Yadavalli) మరియు వారి శిష్యుల బృందం అనేక ప్రసిద్ధ కీర్తనలతో తాళ్ళపాక అన్నమయ్యకు స్వరార్చన చేసుకుని పులకరించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీ మేడసాని మోహన్ (Dr. Medasani Mohan) ప్రారంభోపన్యాసంతో కార్యక్రమం ఆరంభమైంది. అన్నమయ్య కళామందిరం నిర్వహించిన మొదటి ప్రవాసాంధ్రుల సంగీత కార్యక్రమం ఇదే అని, సింగపూర్ స్వర లయ ఆర్ట్స్ వారిదేనని శ్రీ మేడసాని మోహన్ తెలిపారు.
ఈ కార్యక్రమం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సింగపూర్ (Singapore) వాస్తవ్యులు శ్రీ బి.వి.ఆర్. చౌదరి (B.V.R. Choudhary), వారి సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మిగార్లను ఈ సందర్భంగా మేడసానివారు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానితులైన, పదకవితా పితామహుని పన్నెండవ తరం వంశస్థులు శ్రీ తాళ్ళపాక హరినారాయణాచార్యులుగారికి శ్రీ మేడసాని కృతజ్ఙతలు తెలియజేశారు.
శ్రీవేంకటేశ్వరుని (Sri Venkateswara Swamy) వైభవాన్ని, అన్నమాచార్యుని భక్తిసంగీత ప్రాముఖ్యతను వివరిస్తూ స్వరలయ సంస్థ వ్యవస్థాపకులు గురు శ్రీ మతి యడవల్లి శేషు కుమారి కి వారి శిష్యులకు ఆశీస్సులు పలికారు. శ్రీ తాళ్ళపాక హరినారాయణాచార్యుల రాకతో సాక్షాత్తు అన్నమయ్యయే తమని ఆశీర్వదించినట్లు భావించి స్వరలయ సంస్థ కళాకారులు పులకించారు.
స్వరలయ ఆర్ట్స్ (Swarlaya Arts) వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ శ్రీమతి యడవల్లి శేషు కుమారి (Seshu Mudiganti Yadavalli) గారు 2019లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించి, సురవరంప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌తో అనుబంధంగా స్వరలయ ఆర్ట్స్ – ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సింగపూర్ లో సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు మరియు నాట్య శాస్త్రంలో విద్యార్ధులకు తరగతులు నిర్వహిస్తున్నారు.
అలాగే శ్రీమతి యడవల్లి శేషు కుమారి (Seshu Mudiganti Yadavalli) గారు US, హాంకాంగ్, ఆస్ట్రేలియా, ఇండియా మరియు మలేషియా నుండి అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను (Online Classes) నిర్వహిస్తున్నారు.