Hyderabad, Telangana: అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో కీలక కేంద్రంగా హైదరాబాద్ మారిందని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ (Laura Williams) అన్నారు. శుక్రవారం, హైదరాబాద్ టి హబ్ (T-Hub) వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మధు యాష్కీ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మెన్ శివసేనారెడ్డి, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా (Jayanth Challa), ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, సిఐఐ వైస్ ప్రెసిడెంట్ గౌతం రెడ్డి, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటగా తెలుగులో అందరికి నమస్కారం… అందరూ మంచిగున్నారా… అంటూ… అందరినీ ఉత్సాహపరిచారు.
భారతీయ పెట్టుబడిదారులు ఇప్పటికే అమెరికాలో 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక నమ్మకం, భాగస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ (Hyderabad) వేగంగా అంతర్జాతీయ (International) వ్యాపార కేంద్రంగా ఎదుగుతోందని లారా విలియమ్స్ ప్రశంసించారు.
ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ (Life Sciences), బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ సాధించిన ప్రగతి ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు హైదరాబాద్ (Hyderabad) ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని ఆమె అన్నారు.
అలాగే ఐటీ పరంగా ఇన్నోవేటివ్ ఐడియాలకు కేంద్రంగా టి హబ్ మారిందని, స్టార్టప్‌లు (Startup), గ్లోబల్ కార్పొరేట్లు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే టి–హబ్ నమూనా దేశానికే ఆదర్శమని ఆమె అన్నారు. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ, డేటా రక్షణ, కీలక మౌలిక సదుపాయాల భద్రతలో భారత్–అమెరికా సహకారం మరింత బలపడాల్సిన అవసరం ఉందని అమెరికా యుఎస్ కాన్సల్ జనరల్ లారా విలియమ్స్ సూచించారు.
అలాగే ఆటా (ATA) చేస్తున్న ప్రయత్నాలకు గాను, అమెరికా, భారతదేశాల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న ఆటా సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.అంతకముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ, తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందని, రైజింగ్ తెలంగాణగా మారిందని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.
అమెరికాలో ఎదిగి తాము పుట్టిన ప్రాంతానికి ఏదో ఒక్కటి చేయాలనే ఉద్దేశ్యంతో ఆటా (ATA) చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అని అన్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారదర్శక విధానాలను వివరించారు.
అమెరికన్ సంస్థలకు హైదరాబాద్ (Hyderabad) అత్యంత అనుకూల గమ్యస్థానమని, పరిశ్రమలు–ప్రభుత్వం మధ్య సమన్వయం తెలంగాణ బలమని ఆయన తెలిపారు. అనంతరం ఈ సెమినార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI), డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో భారత్, ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించనుందని, ఐటీ భద్రత, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భారతదేశం వ్యూహాత్మకంగా ఎదుగుతున్న తీరు, గ్లోబల్ సరఫరా గొలుసుల్లో కీలక భాగస్వామిగా మారుతున్న అంశాలపై వక్తలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని (Narasimha Dyasani), సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి (Parmesh Bheemreddy), రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా (Eshwar Banda) తదితరులు వున్నారు.