వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Vanguri Foundation of America), వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ (Telugu Academy) పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు అయిన డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారు.
నవంబర్ 23వ తేదీ హైదరాబాద్ లో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr. Tenneti Sudha Devi), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు గారి ధర్మపత్ని. “సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు మరియు భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము” అని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు (Chitten Raju Vanguri), శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ (Ratna Kumar Kavuturu), కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి (Radhika Mangipudi) తెలియజేశారు.
సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా. వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ (India) నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్ (Dr. Medasani Mohan), సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్ (Ghazal Srinivas), గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్ (Qatar), కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా (Australia), న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు పాల్గొన్నారు.
అలాగే ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి (Sarada Akunuri), రాధిక నోరి, రాధ కాసినాథుని, కె ధర్మారావు, గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి, డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించుకున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.