Skysville, Maryland: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా డీఎస్సీ సంస్థతో కలిసి మేరీల్యాండ్ డౌన్‌టౌన్‌లో దీపావళి వేడుకలు నిర్వహించింది. భారతీయ సంస్కృతిని, అమెరికన్ కమ్యూనిటీని ఒకే తాటిపైకి తీసుకువచ్చి దీపావళి శోభను డౌన్‌టౌన్‌లో తెచ్చింది.
దాదాపు 300 మంది భారతీయులు, అమెరికన్‌లు హాజరై, దీపావళి (Diwali) వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. డీఎస్సీ డైరెక్టర్ జూలీ డెల్లా-మారియా (Julie Della-Maria), స్థానిక వ్యాపారవేత్త స్పాన్సర్ కల్పేష్ పటేల్, అలాగే NATS మేరీల్యాండ్ కోఆర్డినేటర్ వకుల్ తదితర ప్రముఖులు తమ దీపావళి సందేశాలను అందించారు.
టౌన్ కౌన్సిల్‌వుమెన్ అలెక్స్ రీస్ (Alex Reece) కూడా హాజరై, ఈ సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రశంసిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మండల కళాకారిణి విదిషా తన అందమైన చేతి చిత్రాలను ప్రదర్శించగా, బాంబే చాయ్ ఎల్‌ఎల్‌సీ నుంచి మితేష్ అందించిన ఆరోగ్యకరమైన చాయ్ మిశ్రమాలు విస్తృతంగా ప్రశంసలు పొందాయి.
సాంప్రదాయ భారతీయ వస్త్రాలు, ఆభరణాల విక్రయం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. విద్యా థెరపిస్ట్ అయిన డా. లారెన్ (Dr. Lauren), తన సుగంధ దీపాలతో వేడుకకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. పిల్లలు, యువతులు, పెద్దలు చేసిన ఆకర్షణీయమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
కాండిల్ మార్చ్లో అందరూ కలిసి వెలుగుల ఊరేగింపుగా పాల్గొని, వివిధ కమ్యూనిటీల మధ్య ఉన్న ఐక్యతను చాటిచెప్పారు. వాలంటీర్లు (Volunteers), పిల్లలకు, అతిథులకు అందమైన హెన్నా (మెహందీ) డిజైన్లు వేసి, పండుగ వాతావరణంలో మరింత ఆనందాన్ని పంచుకున్నారు.
దీపావళి వేడుకలను దిగ్విజయం చేయడంలో NATS మేరీల్యాండ్ చాప్టర్ కోఆర్డినేటర్ వకుల్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ, విమెన్ ఎంపవర్‌మెంట్ చైర్ హరిణి, కల్చరల్ చైర్ సువర్ణలు కీలక పాత్ర పోషించారు. డీఎస్సీ ఈవెంట్ కోఆర్డినేటర్ బ్రియానా, సభ్యురాలు చైతన్య వంటి అనేక మంది వాలంటీర్లు ఈ వేడుకల కోసం అహర్నిశలు శ్రమించారు.
నాట్స్ (NATS) డీఎస్సీ సంస్థతో కలిసి మేరీల్యాండ్ డౌన్‌టౌన్‌లో భారతీయ సంస్కృతిని, అమెరికన్ కమ్యూనిటీని ఒకే తాటిపైకి తీసుకువచ్చిన వేడుకలకు సహకరించినందుకు జూలీ డెల్లా-మారియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.