Connect with us

Devotional

Poland, Warsaw: పోలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Published

on

విదేశీ నేలపై తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, పోలాండ్ రాజధాని వార్సా (Poland, Warsaw) లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) ఆధ్వర్యంలో అక్టోబర్ 18న ఈ దివ్య మహోత్సవం జరిగింది.

టిటిడి (TTD) ఏఈఓ శ్రీ మల్లయ్య గారి పర్యవేక్షణలో టిటిడి అర్చక బృందం వేద ఆచారాలతో, శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ కృతువును నిర్వహించింది. వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు, పుష్ప అలంకరణలతో వేదిక మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం (Indian Embassy, Warsaw) నుంచి ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, శ్రీవారి దివ్య ఆశీస్సులను పొందారు. విదేశీ నేలపై భారతీయ సంస్కృతికి లభించిన ఈ గౌరవం అందరినీ ఆనందభరితులను చేసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు పులకించిపోయారు.

అర్చకులు తిరుమలలో జరిగే విధంగా కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. వేదిక మొత్తం “గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగింది. కళ్యాణ మహోత్సవంతో పాటు వేద పారాయణం, సాంప్రదాయ అలంకరణలతో ఈ వేడుక ఒక ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ సంవత్సరపు శ్రీనివాస కళ్యాణం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

పోలాండ్ తెలుగు అసోసియేషన్ (Poland Telugu Association – PoTA) వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను శాశ్వతంగా పోలాండ్‌కు తీసుకురావడం జరిగింది. ఇది పోలాండ్ భక్తులకు ఆధ్యాత్మికంగా ఒక కొత్త యుగానికి నాంది పలికింది. ఇకపై స్వామివారి నిత్యారాధనలు, పూజలు, ఉత్సవాలు స్థానికంగా జరిగేలా ఏర్పాట్లు చేయడం పోలాండ్ తెలుగు అసోసియేషన్ మహత్తర సాధనగా నిలిచింది.

ఈ పవిత్ర వేడుకలో తెలుగు (Telugu), తమిళ, కన్నడ మరియు ఇతర భారతీయ (India) రాష్ట్రాల భక్తులతో పాటు అనేక విదేశీ భక్తులు కూడా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. అనంతరం భక్తులకు టిటిడి (Tirumala Tirupati Devasthanams – TTD) లడ్డు ప్రసాదం మరియు కళ్యాణ ప్రసాదం పంపిణీ చేశారు.

Poland Telugu Association (PoTA) అధ్యక్షులు శ్రీ చంద్రభాను (Chandra Bhanu Akkala) గారు మాట్లాడుతూ.. “పోలాండ్‌లో నివసిస్తున్న భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం మా అసోసియేషన్ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.

ఈ విజయవంతమైన కార్యక్రమం పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) బృందం యొక్క అంకితభావం, సమిష్టి కృషి ఫలితం. సంస్థ వ్యవస్థాపకులు హరి చంద్ కాట్రగడ్డ మరియు చంద్రభాను ఆక్కల  గారి నాయకత్వంలో, వైస్ ప్రెసిడెంట్ సురేష్ పెరుమాళ్ళ, జనరల్ సెక్రటరీ శైలేందర్ గంగుల సమన్వయంతో ఈ మహోత్సవం ఘనవిజయాన్ని సాధించింది.

కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన బాపిరాజు దుమంతరావు, కుప్పిలి రామకృష్ణ, సందీప్ శ్రీనాధుని, సుబ్బిరామిరెడ్డి బైరెడ్డి, సంజీవ్ కుమార్ గాదేపల్లి, కందుల రామ్మోహన్, కందుల తేజ, కందూరి శరత్ చంద్ర, ఆళ్ల పృద్వి, కాట్రగడ్డ విజయకుమార్, సంపత్ కుమార్ మద్దుల అలాగే SHE టీమ్ కోర్ కమిటీ సభ్యులు స్వాతి అక్కల, విశ్వశాంతి గాదేపల్లి, శ్రీదేవి మద్భవి, నిహారిక గుండ్రెడ్డి, లక్ష్మీ దుమంతరావు, ఆషా పెరుమాళ్ళ, అను శ్రీనాధుని, కందుల సరోజిని, అపూర్వ కొత్తూరి, కిరణ్మయి బాడినేడి వారి సమిష్టి కృషితో పోలాండ్‌లో తిరుమల వైభవం సజీవమైంది.

యూరప్ ప్రధాన కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని (Dr. Kishore Babu Chalasani) సారధ్యంలో డాక్టర్ శ్రీకాంత్ సుమంత్ కొర్రపాటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విజయవంతంగా సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. “గోవిందా… గోవిందా!” నినాదాలతో ముగిసిన ఈ దివ్య వేడుక భక్తుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అని చెప్పటంలో అతిశయోక్తి కాదు.

error: NRI2NRI.COM copyright content is protected