Frisco, Texas: భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society – NATS) డల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా, సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ (City of Frisco Park) విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు.
సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగు అని పర్యావరణ పరిరక్షకులు తెలిపారు. గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ చాప్టర్ (Dallas Chapter) ఈ మొనార్క్ వ్యూ పార్క్ ను దత్తత తీసుకుని, అక్కడ తరచూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది.
ఈ కాలంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. పార్క్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ 2,000 కు పైగా మొక్కలను నాటిన ఘనతను నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) సాధించింది. నాట్స్ చేస్తున్న నిరంతర కృషిని సిటీ ఆఫ్ ఫ్రిస్కో ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న 25 మంది NATS యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు.
ఈ కార్యక్రమానికి సిటీ ఆఫ్ ఫ్రిస్కో (City of Frisco) పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా హాజరయ్యారు. నాట్స్ తరపున ప్రతినిధులు బాపు నూతి (Bapu Nuthi), రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) ఇలాంటి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక అభినందనలు తెలిపారు.