Texas, Austin: అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించాలన్న సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) పాఠశాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వివిధ నగరాల్లో తరగతులను ప్రారంభించింది, అస్టిన్ (Austin, Texas) లో కూడా పాఠశాల 6వ సంవత్సరం తెలుగు తరగతులను ఇటీవల ఘనంగా ప్రారంభించారు.
పాఠశాల విద్యార్థిని ఆర్యశ్రీ ప్రార్థనలతో తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠశాలకు జాతీయ స్థాయిలో కో-చైర్‌పర్సన్ గా ఉన్న ఉపాధ్యాయురాలు రజని మారం (Rajani Maram) తరగతులను ప్రారంభించి మాట్లాడారు. తానా పెద్దల సహకారంతో ఈ సంవత్సరం కూడా తరగతులను ఘనంగా ప్రారంభించామని అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా తెలుగు పిల్లల కోసం పాటన్ ఎలిమెంటరీ స్కూల్‌లోని ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (ఎఐఎస్‌డి) లో తరగతులను నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అస్టిన్ (Austin, Texas) తో పాటు ఈ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న తెలుగువాళ్ళు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించి, మాతృభాషా అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె తానా నాయకులను, ఉపాధ్యాయులు వాసవి, శ్వేత, రాజేష్, అనుషలను అందరికీ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Naren Kodali), కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi), మరియు పాఠశాల చైర్ భాను మాగులూరి విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
అదే రోజు, నమోదిత విద్యార్థులకు పుస్తకాలు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. తెలుగు (Telugu) ఉచ్ఛారణ తరగతులను ప్రారంభించి, పాటన్ ఎలిమెంటరీ స్కూల్‌లోని ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (ఎఐఎస్‌డి)లో రెండు సంవత్సరాల తెలుగు తరగతులను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసారు.
ఈ తానా (Telugu Association of North America – TANA) పాఠశాల కార్యక్రమానికి విద్యార్థులతోపాటు తల్లితండ్రులు, ఇతరులు హాజరయ్యారు. చివరన ఈ కార్యక్రమానికి వచ్చినవారందరికీ రజనీ మారం ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.