తెలుగు భాషను ప్రవాస తెలుగు సంఘం తానా (Telugu Association of North America – TANA) వేదికగా నేటి తరం చిన్నారులకు అందించే సమున్నత సంయుక్త ప్రయత్నరూపమే పాఠశాల. గత వారం రోజులుగా పలు రాష్ట్రాలలో ప్రత్యక్షంగా, అంతర్జాలం వేదికగా తరగతులు పలు దశల్లో పలు విభాగాలకు ఆరంభమయ్యాయి.
చిన్నారులకు సరళంగా తెలుగు (Telugu Language) నేర్పించే అంశాలతో పాఠాలు, అనుభవం ఉత్సాహం గల ఉపాధ్యాయుల సమిష్టి ప్రయత్నంతో తానా పాఠశాల (TANA Paatasala) ఎన్నో సంవత్సరాలుగా ప్రవాస తెలుగు వారి కుటుంబాలలో భాగమయ్యింది.
తేనెలొలుకు మన మాతృభాష తెలుగు మన పిల్లలకోసం. తలలు మారినా, తరాలు మారినా బంధాలకు మాతృభాషే వారధిగా చరిత్ర సాంస్కృతిక సారధిగా పరిరక్షించుకోవాల్సిన అవసరం, భాద్యత మనందరిదీ. మనల్ని కని, పెంచిన మన తల్లిదండ్రులకూ, మనం కని, పెంచుతున్న మన పిల్లలకూ మధ్య బంధం మన మాతృబాష తెలుగు.
అనుభవం గల పెద్దలు తమ వాత్సల్యాన్ని, ప్రేమను పంచుకోవాలన్నా, నేటి తరానికి అది ఆసాంతం కావాలన్న భాషే బంధానికి మూలం. మన పిల్లలకు తెలుగు (Telugu Language) నేర్పిద్దాం.. విశ్వ వేదికపై తెలుగు వారిగా గర్విద్దాం.