మార్చ్ 24న సియాటిల్‌లో వాషింగ్టన్ తెలుగు సమితి ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సియాటిల్ లోని తెలుగువారందరినీ సాంస్కృతికంగా ఒక చోటకి చేర్చే ఉద్దేశ్యంతో 16 ఏళ్ళ క్రితం యేర్పాటైన వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విళంబి నామ ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. స్థానిక బెల్వ్యూ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, నాటకాలు, పాటలు, ఆలపించిన శ్లోకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పండితులు గారి ఉగాది పంచాంగ శ్రవణం అందరూ శ్రద్ధగా ఆలకించారు. అలాగే నగరములో ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆభరణాలు, వస్త్రాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి. పసందైన విందు భోజనం మన ఊరిలోని పండుగ భోజనాన్ని గుర్తుకుతెచ్చింది. గాయని శిల్పారావు మరియు ఎన్నో కొత్త సినిమాల్లో పాటలు పాడిన యువ గాయకులు నరేంద్ర తమ హుషారైన పాటలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. చివరిగా వాట్స్ అధ్యక్షురాలు అను గోపాళం, ఉపాధ్యక్షులు రాం పాలూరి మరియు ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో వాట్స్ ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలియచేసారు. మరిన్ని ఫోటోల కొరకు వాట్స్ ని సంప్రదించండి.