Kurnool, Andhra Pradesh: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా ఆరవ సంవత్సరం ₹10 లక్షల విరాళాన్ని తానా (TANA) బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి అందించారు. శుక్రవారం ఆగస్టు 29 నాడు బాలభారతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు రేంజి డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా (DIG Dr. Praveen Koya)₹10 లక్షల రూపాయల చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు.
అనాధ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు తానా బోర్డు సభ్యులు, కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి (Ravi Potluri) తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా (DIG Dr. Praveen Koya) తెలిపారు. పొట్లూరి రవి స్పూర్తితో ఎన్నారైలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని IAS, IPS కి అర్హత సాధించాలని, బాలభారతి పాఠశాలకు వస్తూ ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
బాలభారతి పాఠశాల (Bala Bharathi English Medium School) ను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలభారతి పాఠశాల నుండి Counts and Gudies లో రాజ్య పురస్కారానికి అర్హత సాధించి గవర్నర్ తో ప్రశంసా పత్రం అందుకున్న విద్యార్థిని గీతను అభినందించి ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు విచ్చేసిన అతిధులకు పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో పొదుపుసంఘం మహిళలు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.
ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘం మహిళల కృషితో ఏర్పాటు చేసుకున్నబాలభారతి పాఠశాలకు పొట్లూరి రవి (Ravi Potluri) మిత్రుల సహకారం మరువలేనిదని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి తెలిపారు. స్వయంకృషితో ఎదిగి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సహకారం అందిస్తున్న ఎన్నారైలు అందరికీ ఆదర్శమని తెలిపారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ (Kurnool NRI Foundation) అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఎన్నారైల సహకారంతో జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ (Muppa Rajasekhar) తెలిపారు.
పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ (Kurnool NRI Foundation)అందిస్తున్న సహకారం మరువలేనిదని బాలభారతి పాఠశాల (Bala Bharathi English Medium School) ప్రధానోపాద్యాయుడు కరస్పాండెంట్ సవ్య తెలిపారు. ఈ డిఎస్పీ బాబు ప్రసాద్, సిఐ చంద్రబాబు, ఎసై సునీల్ పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కమిటీ కార్యవర్గం రత్నమ్మ, జుబేదా, సుమతి, సరస్వతి మరియు బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.