Washington DC: అమెరిక రాజధాని వేదికగా.. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని (World Senior Citizen’s Day) ఘనంగా నిర్వహించారు. తానా (TANA) పాఠశాల వేదికపై భానుప్రకాష్ మాగులూరి సమన్వయపరచి ఈ కార్యక్రమంలో.. జీవితకాల అనుభవం కలిగి ఎత్తుపల్లాల్ని, ఆటుపోట్లను దాటుకొని తమ కుటుంబం కోసం, సమాజహితం కోసం, జన జాగృతి కోసం క్రమశిక్షణతో మెలిగి జీవితాన్ని శోధించి, సాధించిన పెద్దలను గుర్తుంచుకొని గౌరవించుకునే రోజుగా అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ గా దశాబ్దాల అనుభవంతో, విద్యారంగంలో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది, మాతృభూమి భారతదేశంలో సామాజిక, సేవా రంగాలలో అశేష సేవ లందించిన డాక్టర్ మూల్పూరి వెంకటరావు (Dr. Venkata Rao Mulpuri) గారిని ఈ సందర్భంగా ప్రవాస భారతీయ తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి పరస్పర అభినందనలు తెలుపుకున్నారు.
ఏ సందర్భంగా వెంకట్రావు (Dr. Venkata Rao Mulpuri) మాట్లాడుతూ… మాతృభూమి, మాతృబాష మనకు రెండు కళ్ళు.. పుట్టి పెరిగిన ఊరుని, అమ్మభాష తెలుగుని కాపాడుకోవటం మనందరి విధి. ముఖ్యంగా తాతలు, అమ్మమ్మల వాత్సల్యంతో, తెలుగు అనుబంధంతో పెరిగిన పిల్లల మానసిక స్థితి, పరిపక్వత, జీవితం పట్ల విలువల అవగాహన గొప్పగా ఉంటుందన్నారు.
భాను మాగులూరి (Bhanu Maguluri) మాట్లాడుతూ..భాషే బంధమని, తరాల మధ్య అనుభవం, సాంస్కృతిక వారధి అని, గత తరం చరిత్రను, వైభవాన్ని రేపటి తరానికి అందించటానికి, కనీస అవగాహన కల్పించటానికి మాతృభాషను మించిన వేదిక లేదన్నారు. మాతృభాషను ముందు తరాలకు అందించటం మన బాధ్యత అని, తానా (TANA) పాఠశాల చేస్తున్న నిరంతర ప్రయత్నాన్ని అభినందించారు.
చిన్నారులను పాఠశాలలో చేర్పించి, TANA పాఠశాల వేదికగా మన పిల్లల కోసం మన తెలుగు అని చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించామని కోరారు. పెద్దల అనుభవం ఆస్తి అని, ఈనాడు మన పెద్దలను గౌరవించి.. రేపటి రోజున మనం పెద్దలై అదే గౌరవానికి అర్హత పొందుదాం అన్నారు.
ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవం (World Senior Citizen’s Day) కార్యక్రమంలో కామేశ్వరరావు, శ్రావ్య చామంతి, గోన మోహనరావు, పునుగువారి నాగిరెడ్డి, మేకల సంతోష్ రెడ్డి, బండి సత్తిబాబు, నంబూరి చంద్రనాథ్, గుంటుపల్లి నరసింహారావు, వనమా లక్ష్మీనారాయణ, చల్లా సుబ్బారావు, వనమా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.