Connect with us

Literary

Houston, Texas: తెలుగు భాష, సాహిత్యాలకు ప్రాధాన్యత ఇస్తూ 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతం

Published

on

Texas, August 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ (Houston) మహానగరం, అమెరికాలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” తెలుగు భాష, సాహిత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్తంగా నిర్వహించారు.

దిగ్విజయవంతంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సాహితీ సదస్సులో భారత దేశం (India) నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికా (USA) లో పలు నగరాల నుండి 75 మందికి పైగా విచ్చేసి, 28 విభిన్న వేదికలలో పాల్గొని సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషా, సాహిత్య సౌరభాలని పంచుకున్నారు.

హ్యూస్టన్ (Houston)లో తెలుగు బడి, మన బడి బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి గురువందన సత్కారాలతో మొదలయిన ఈ జాతీయ స్థాయి సాహిత్య సదస్సుని “పద్మభూషణ్” ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంఛనప్రాయంగా ప్రారంభించగా భారతదేశం నుంచి తొలిసారి అమెరికా విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ “సినిమా సాహిత్యం, తెలుగు భాష” అనే అంశం మీద సాధికారంగా చేసిన ప్రధానోపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు.

కాలిఫోర్నియా (California) లోని అరియా విశ్వవిద్యాలయం (Aria University USA) తెలుగు శాఖ పురోభివృధ్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కును సభాముఖంగా ఆ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజు చమర్తి గారికి అందజేశారు.

ఈ సందర్భంగా తెలుగు భాషా, సాహిత్యాలకి ఎవరో, ఏదో చెయ్యాలి అనే కంటే ఉన్న వ్యవస్థలని పటిష్టం చెయ్యాలి అని వంగూరి చిట్టెన్ రాజు పిలుపునివ్వగా, దానికి ఆచార్య యార్లగడ్డ, రాజు చమర్తి సముచితంగా స్పందించారు. శాయి రాచకొండ, రాధిక మంగిపూడి (Radhika Mangipudi), బుర్రా సాయి (Burra Sai Madhav) మాధవ్ పాల్గొన్న ఈ ప్రత్యేక వేదిక సదస్సు విశిష్ట ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఈ సదస్సులో మొత్తం 17 నూతన తెలుగు గ్రంథాలు ఆవిష్కరింపబడగా అందులో 5 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణలు కావడం విశేషం. పాణిని జన్నాభట్ల నిర్వహణలో జరిగిన ‘అమెరికా కథ’ చర్చా వేదిక, విన్నకోట రవిశంకర్ నిర్వహణలో జరిగిన కవితా చర్చా వేదిక, బుర్ర సాయి మాధవ్ (Burra Sai Madhav) తో శాయి రాచకొండ నిర్వహించిన ముఖాముఖి, ఉరిమిండి నరసింహారెడ్డి, శారదా కాశీవజఝ్ఝల నిర్వహించిన సాహిత్య ప్రహేళికల కార్యక్రమాలు, కథా రచన పోటీ మొదలైన ఆసక్తికరమైన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

డాలస్ నివాసి, తానా (TANA) సాహిత్య వేదిక అధ్యక్షులు, అమెరికాలో ప్రముఖ సాహితీవేత్త అయిన డా. తోటకూర ప్రసాద్ గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం అందించి సత్కరించింది. అమెరికా డయాస్పోరా కథ షష్టిపూర్తి ప్రత్యేక వేదికలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, సి నారాయణస్వామి, భాస్కర్ పులికల్ ప్రసంగించారు.

రెండు రోజులపాటు 50కి పైగా వక్తలు పాల్గొన్న వివిధ ప్రసంగ వేదికలలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బుర్రా సాయి మాధవ్, ఈమని శివనాగిరెడ్డి, జీ. వల్లీశ్వర్, రాధిక మంగిపూడి, కోసూరి ఉమాభారతి, హరి మద్దూరి, శారద ఆకునూరి, జ్యోతి వలబోజు, ఇర్షాద్ జేమ్స్, దయాకర్ మాడా, సత్యం మందపాటి, మద్దుకూరి విజయ చంద్రహాస్, కె గీత, అఫ్సర్, కల్పనా రెంటాల, వ్యాసకృష్ణ, జెపి శర్మ, కొండపల్లి నిహారిణి, విజయ సారథి జీడిగుంట, అత్తలూరి విజయలక్ష్మి, కేతవరపు రాజ్యశ్రీ తదితరులు ప్రసంగించారు.

సదస్సు నిర్వహణకి ఆర్థిక సహాయం అందజేసిన వదాన్యులకు ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు (Vanguri Chitten Raju), శ్రీకాంత్ రెడ్డి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సదస్సు నిర్వాహకవర్గ సభ్యులుగా శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇంద్రాణి పాలపర్తి, కోటి శాస్త్రి, పంకజ్, రామ్ చెరువు, పుల్లారెడ్డి, కావ్య రెడ్డి, ఇందిర చెరువు, శాంత సుసర్ల, ఉమా దేశభొట్ల, వాణి దూడల తదితరులు వ్యవహరించారు. రెండు రోజుల కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

error: NRI2NRI.COM copyright content is protected