Dallas, Texas: తెలుగు, హిందీ భాషల్లో పీ.హెచ్ డి లు చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, రెండుమార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad) కు టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది.
టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా, డాలస్ పరిసర ప్రాంతంలో నెలకొనిఉన్న మూడు ముఖ్య నగరాలైన ఫ్రిస్కో, గార్లండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్ల (Mayors) నుండి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందన పూర్వక అధికారిక గుర్తింపు పత్రాలు పొందడం తెలుగువారందరికి గర్వకారణమని పలువురు ప్రవాస భారతీయులు కొనియాడారు. గార్లాండ్ నగర మేయర్ డిలన్ హెడ్రిక్ తో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డా. యార్లగడ్డకు అధికారిక గుర్తింపు పత్రాన్ని మేయర్ స్వయంగా అందచేసి అభినందిం చారు.
సాహిత్య రంగంలోనే గాక, సాంస్కృతిక రాయబారిగా, రచయితగా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల భారతదేశ వారధిగా తన రచనలతో సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యతను పెంపొందించినందుకుగాను టెక్సాస్ (Texas) రాష్ట్ర ప్రభుత్వంతో సహా టెక్సాస్ రాష్ట్రంలోని లిటిల్ ఎల్మ్, గార్లాండ్, ఫ్రిస్కో (Frisco) నగరాలు ఆయన్ను అభినందిస్తూ లేఖలు విడుదల చేశాయి.
మంగళవారం సాయంత్రం ఫ్రిస్కోలో స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వీటిని ఆయా నగరాల అధికార ప్రతినిధులు ఆచార్య యార్లగడ్డకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులు డా. యార్లగడ్డ ను ఘనంగా సత్కరించారు. టెక్సాస్ (Texas) రాష్ట్ర గవర్నర్కు, ప్రభుత్వానికి, ప్రజలకు, ఆయా నగరాల మేయర్లకు, ప్రజలకు లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, ఆత్మచరణ్ రెడ్డి, గోపాల్ పోనంగి, డా. తోటకూర ప్రసాద్ (Dr. Prasad Thotakura), జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, సమీర్, చాంద్ పర్వతనేని, సుబ్బారావు పర్వతనేని, లెనిన్ వేముల, రాజేశ్వరి ఉదయగిరి, రమణ్ రెడ్డి క్రిస్టపాటి, మాధవి లోకిరెడ్డి, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, డా. చైతన్య తుమ్మల, చినసత్యం వీర్నపు, విజయమోహన్ కాకర్ల, విజయలక్ష్మి అత్తలూరి, ఎ. ల్ శివకుమారి, జ్యోతి వనం, మడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.