పెదనందిపాడు, గుంటూరు జిల్లా, జులై 20, 2025: అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS.. తెలుగు నాట మన గ్రామం.. మన బాధ్యత కార్యక్రమంలో కూడా నేను సైతం అంటూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది.
నాట్స్ పూర్వ అధ్యక్షులు, నాట్స్ బోర్డ్ ప్రస్తుత డైరెక్టర్ బాపయ్య చౌదరి నూతి (Bapu Nuthi) చొరవతో, ఆర్ధిక సహకారంతో నాట్స్ ప్రతి యేటా పెదనందిపాడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ వైద్య శిబిరంలో వందల మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
నాట్స్, గ్లో ఫౌండేషన్ (GLOW Foundation) ఆధ్వర్యంలో, శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఉమ్మడి గుంటూరు (Guntur) మరియు ప్రకాశం జిల్లాలలోని వివిధ గ్రామాలనుండి వచ్చిన 550 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. 275 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత అవసరమని ఈ వైద్య శిబిరంలో గుర్తించారు.
కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారి ఉచిత రవాణా కల్పిస్తామని.. వచ్చే పది రోజుల్లో ఉచిత శస్త్ర శికిత్సల చేయించి కళ్లజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని బాపయ్య చౌదరి నూతి (Bapu Nuthi) తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహణలో కీలక పాత్ర పోషించిన స్థానికులు కాకుమాను నాగేశ్వరరావు, దాసరి సుబ్బారావు, దాసరి రమేశ్ తదితరులను నాట్స్ నాయకులు అభినందించారు.
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని బాపయ్య చౌదరి తల్లిదండ్రులైన నూతి సుబ్బారావు, సీతా దేవి దంపతులు, స్థానిక పెద్దలు మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి శేషగిరిరావు, కళాశాల పాలకవర్గ అధ్యక్షులు, విశ్రాంత ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేణు గోపాల్, రావి శివరామకృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్యలు ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉచిత కంటి, వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నందుకు బాపయ్య చౌదరిని మరియు నాట్స్ (North America Telugu Society – NATS) నాయకత్వాన్ని స్థానికులు ప్రశంపించారు. కన్నతల్లిలాంటి జన్మభూమి కోసం మేలు బాపయ్య చౌదరి చేస్తున్న కృషి అమోఘమని అభినందించారు.
గత నాలుగు సంవత్సరాలుగా పెదనందిపాడులో ప్రతి సంవత్సరం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం… పెదనందిపాడు (Pedanandipadu) ప్రాంత అభివృద్ధికి విజ్ఞాన కేంద్రాల తోడ్పాటు అందించడం.. మహిళా సాధికారత, యువ సాధికారత కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో బాపయ్య చౌదరి యువతకు ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడారు.
ఇంకా ఈ కార్యక్రమంలో 25 మంది ఎన్.సి.సి. విద్యార్థులు, కళాశాల పి. డి., ఎన్.సి.సి. కెప్టెన్ డా. పాతూరి శ్రీనివాస్, బాపు ఫ్రెండ్స్ సర్కిల్, గోవిందరాజు, మక్కెన జవహర్ రాణి, నూతి శ్రీను, దొప్పలపూడి రమేష్, కాపు వెంకట సుబ్బారావు, నూతి పూర్ణయ్య, కరీముల్లా, పోతురాజు, ఆలూరి సుజిత్, సరిమెళ్ళ చౌదరి, అంకారావు, మరియు తదితరులు వాలంటీర్స్ (Volunteers) గా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా శంకర కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్ మరియా, డాక్టర్ అపర్ణ, క్యాంపు ఎగ్జిక్యూటివ్ రాంబాబు, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ ఉచిత వార్షిక మెగా కంటి, వైద్య శిబిరాన్ని ప్రతి యేటా విజయవంతంగా నిర్వహిస్తున్న బాపయ్య చౌదరికి, ఈ వైద్య శిబిరానికి తోడ్పాటు అందిస్తున్న నాట్స్ బోర్డ్ డైరెక్టెర్ రాజేంద్ర మాదల (Rajendra Madala) కి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.