అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్ (Detroit, Michigan) వేదికైంది. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ (Suburban Collection Showplace) లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరగనున్నవి.
డెట్రాయిట్ (Detroit) లో 1979, 2005 మరియు 2015 సంవత్సరాలలో తానా మహాసభలు (TANA Convention) ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు 2025 లో తానా 24వ మహాసభలు నిర్వహిస్తున్నారు. గత మూడు సార్లుగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, అలాగే మొత్తంగా 4 అవుట్ ఆఫ్ 24 తానా మహాసభలు డెట్రాయిట్ లో నిర్వహించినట్టన్నమాట.
ఈ మహాసభల ఏర్పాట్లు పూర్తయ్యాయని, అతిధులు వస్తున్నారని కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు (Uday Kumar Chapalamadugu) తెలిపారు. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ (Thaman), ప్రముఖ గాయని చిత్ర (KS Chithra) తో సంగీత విభావరిని ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
సినీ నేపథ్య గాయకురాలు సునీత (Sunitha Upadrashta), గాయకుడు ఎస్.పి.బి. చరణ్ (Sripathi Panditharadhyula Charan) తో కూడా లైవ్ మ్యూజిక్ కార్యక్రమం ఉంటుందని, వీరితోపాటు నేపథ్య గాయనీగాయకులు కూడా ఈ మహాసభల్లో తమ పాటలతో ఆనందపరచనున్నారని తెలిపారు.
ప్రముఖ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఈ మహాసభలకు వస్తున్నారు. తెలుగు కమ్యూనిటీ మహాసభలకు ఆమె రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కూడా హాజరవుతున్నారు. సెలబ్రిటీలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది.
అన్నమాచార్య స్వరార్చన పేరుతో శ్రీమతి శోభారాజు (Shobha Raju) కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. ఈ మహాసభలకు సినిమా, సాహిత్యం, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. మహాసభలకు సాధారణ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జూలై 4, 5వ తేదీ వరకు జరుగుతుంటాయి.
వచ్చిన అతిధులకోసం అక్కడికి సమీపంలో ఉన్న హోటళ్ళలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాన్ఫరెన్స్‌కు వచ్చే అతిధులు, ఇతరులకోసం ఆతిధ్య ఏర్పాట్లను అందరికీ సరిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది వస్తున్న ఈ తానా (TANA) మహాసభలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ఉదయ్‌కుమార్ చాపలమడుగు కోరారు.