Connect with us

Cultural

TANTEX తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు, ప్రముఖులకు అవార్డులు & సన్మానం @ Plano, Texas

Published

on

అమెరికా, టెక్సాస్ (Texas) రాష్ట్రం, డల్లాస్ ఫోర్ట్ వర్త్ , ప్లేనో (Plano) నగరంలోని గ్రాండ్ సెంటర్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్, టాంటెక్సు ఆధ్వర్యంలో ” విశ్వావసు నామ”సంవత్సర ఉగాది ఉత్సవాలు” ఘనంగా నిర్వహించబడ్డాయి. 2025 సంవత్సరం ఏప్రిల్ 12 న ఏర్పాటు చేసిన ఈ ఉగాది వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తొలుత చిన్నారులు అమెరికా జాతీయ గీతాన్ని చక్కగా ఆలపించారు.

శ్రీ దయాకర్ మాడా (Dayakar Mada) స్వాగత వచనాలు పలుకుతూ ”తాను 2025 సంవత్సరానికి గానూ టాంటెక్స్ పాలకమండలి ఉపాధ్యక్షులు గానూ ఇంకా తెలుగు సాహిత్య వేదిక సమన్వయ కర్త గానూ సేవలందిస్తున్నాననీ, సంస్థ ప్రతి నెలా నిర్వహించే ”నెల నెలా తెలుగు వెన్నెల” తెలుగు సాహిత్య వేదికకు హాజరవవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేశారు. సాంస్కృతిక చెయిర్ శాంతి నూతి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సుమారు 150 మంది చిన్నారులు, మహిళలు భక్తితో ఉగాది పండుగ జరుపుకొనే విశేషాలు ప్రతిబింబించే చలన చిత్ర నృత్యాలు, ఇంకా సంగీత నృత్య రూపక కార్యక్రమాలు అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. మ్యూ ఫిన్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రదర్శించిన ”ఎన్ టీ ఆర్” ,”ఏ ఎన్ ఆర్” నటించిన ఆనాటి మేటి సినీచిత్రాల ” రాగ గాత్ర సంయుక్త సంగీత విభావరి ” ప్రతి ఒక్కరినీ ఆనంద డోలికలలో ఉర్రూత లూగింప చేసింది.

ప్రణయ్ పొట్టిపాటి బృందంలోని హైస్కూలు విద్యార్థులు వాయిద్య పరికరాలతో అద్భుతంగా నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం నిజంగా ఓ అద్భుతం. ఆదిత్య 369 ”చలనచిత్రం ఆధారంగా పునర్నిర్మించిన ”కాలయంత్రంలో విజయ వైభవం” అనే హాస్య రూపకాన్ని ‘మనబడి’ (Manabadi) చిన్నారులు ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకొంది. మన్వితారెడ్డి బృందం ”రామాయణం కథ”, శ్రీలత సూరి బృందం భారతీయ పెళ్లిళ్ల సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన ”సువ్వి..సువ్వి” జానపద నృత్యం చాలా చాలా బాగుంది.

తొలుత పంచాంగ శ్రవణము (Panchanga Sravanam) తో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సింధూజ ఘట్టమనేని నిర్వహించిన రాగమయూరి బృంద చలన చిత్ర క్లాసికల్ నృత్యాలు, బాలరాముని ప్రతిష్ట జరిగిన అయోధ్యలోనే కాకుండా శ్రీలంక వంటి అనేక దేశాలలో ప్రదర్శనలిచ్చిన ప్రముఖ కూచిపూడి కళాకారిణి, నాట్యకౌముది, నాట్య విశారద బిరుదాంకితురాలు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీమతి కల్యాణి ఆవుల గారి శిష్యులైన విద్యార్ధి బృందం అభినయినయించిన ”రామాష్టకం” నృత్య రూపకం ప్రేక్షకులని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

ఇవేగాక చిన్నారి యువతుల జట్టుతో రూపొందించిన క్లాసికల్ నృత్యాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. ప్రముఖ గాయనీ గాయకులు శ్రీకాంత్ లంకా, అంజనా సౌమ్య ల చలన చిత్రగానం టాంటెక్స్ఉగాది ఉత్సవాలకె ఓ హైలైట్. తెలుగు వారి తొలి పండుగ ”శ్రీ విశ్వా వసు నామ ఉగాది ఉత్సవాల”లో భాగంగా వివిధ రంగాలలో నిపుణులైన ప్రముఖులను ఈసందర్భంగా సన్మానించడం జరిగింది. టాంటెక్స్ (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టాంటెక్స్ సభ్యులందరి తరపున శ్రీమతి శ్రీదేవి యడ్లపాటి గారినీ, శ్రీ ప్రేమ్ గంగలకుంట గారినీ ఘనంగా సన్మానించడం జరిగింది.

సాహిత్యాభిమానులు విశేషంగా అభిమానించే గానసుధా సభ్యులు సాయి బూర్లగడ్డ గారికీ, ఎన్ ఎన్ టీవీ & మీడియాకు నిరంతరంగా సాహిత్య సేవలు అందిస్తున్న శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula) గారికీ, ప్రతి నెలా జరిగే ”నెల నెలా తెలుగు వెన్నెల” కార్యక్రమాన్ని వీక్షించే సాహిత్యాభిలాషులను తన భక్తిరసగాన మాధుర్యంతో రంజింపచేస్తున్నచిరంజీవి సమన్వితా మాడ కూ అత్యంత విశిష్ట మైన ”బెస్ట్ వాలంటీర్” అవార్డును అందచేయడం జరిగింది.

అంతేకాక తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా ”విశ్వావసు నామ సంవత్సర తెలుగు కేలండరును ”టాంటెక్స్ సంస్థ పాలక మండలి మరియు కార్యనిర్వాహక సభ్యులు కలిసి ఆవిష్కరించడం జరిగింది. శ్రీయుతులు వాసవి మరియు స్వాతి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈకార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. ”సాంస్కృతిక చెయిర్ గా శాంతి నూతి వ్యవహరించగా, ఈవెంట్ కోఆర్డినేటర్ గా వీరా లెనిన్ తుళ్లూరి చక్కటి ఆచరణాత్మక ప్రణాళికతో ప్రతి ఒక్కరు సమయపాలన పాటించేలా ఆద్యంతం ముందుండి నడిపించారు.

డల్లాస్ టెక్సాస్ (Dallas, Texas) లో రుచికరమైన వంటకాలకు పేరెన్నికగన్న రాయలసీమ రుచులు వారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహూతులందరికీ షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగింప చేశారు. టాంటెక్స్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees), పాలక మండలి సభ్యులతో పాటు టాంటెక్స్ సాధారణ సభ్యులనేక మంది వారి కుటుంబ సభ్యులతో కలిసి టాంటెక్స్ నూతన తెలుగు ఉగాది ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

టాంటెక్స్ సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ చంద్ర శేఖర్ పొట్టిపాటి (Chandra Sekhar Reddy Pottipati), ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీమతి మాధవి లోకిరెడ్డి (Madhavi Lokireddy), ఉపాధ్యక్షులు ఉదయ్ నిడిగంటి, కార్యదర్శి శ్రీమతి దీప్తి సూర్యదేవర, ట్రెజరర్ అనిల్ సూరపరాజు, సంయుక్త కార్యదర్శి దీపికారెడ్డి, జాయింట్ ట్రెజరర్ లక్ష్మీ నరసింహ పోపూరి, తక్షణ ఉపాధ్యక్షులు సతీష్ బండారు సంస్థ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నల గడ్డ, శ్రీ చిన్న సత్యం వీర్నాపు, శ్రీ మూర్తి ములుకుట్ల, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్, లెనిన్ వేముల, నవీన్ గొడవర్తి, రాజా వంటి సాహితీ ప్రియులే కాక ప్రపంచ వ్యాప్త తెలుగు సంస్థలైన నాటా, తానా, నాట్స్, తెలంగాణ ప్యూపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ వంటి స్థానిక తెలుగుసంస్థల ప్రతినిధులతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరవడంతో ”టాంటెక్స్ఉగాది ఉత్సవాలు” విజయవంతమైనాయి.

ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, టాంటెక్సు అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ పొట్టిపాటి మాట్లాడుతూ.. దాదాపు నలభై ఏళ్ళక్రితం డల్లాస్ కేంద్రంగా విద్య ఉద్యోగాల కోసం మాతృదేశాన్ని వదిలి వచ్చిన తెలుగువారు అంతా ఒక్కటై తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకొనడం కోసం 1986 లో టాంటెక్స్ (TANTEX) సంస్థను ఏర్పాటుచేసుకున్నారనీ, ఘనమైన చరిత్ర గల ఈసంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఈవేడుకలను నిర్వహించాలని తలపెట్టినప్పటినుండీ రిజిస్ట్రేషన్, వెండర్ బూత్స్, భోజన సదుపాయాల కల్పనకోసం గత రెండు నెలలనుండీ అహర్నిశం శ్రమించిన టాంటెక్స్ (TANTEX) పాలక మండలి మరియు కార్య నిర్వాహక బృందం సభ్యులకు మరియు వాలంటీర్లకు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ 2025 చైర్మన్ శ్రీ కొండా తిరుమల రెడ్డి మరియు కో-చెయిర్ దయాకర్ మాడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియ చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected