Bloomington, Illinois: ఇల్లినాయిస్ రాష్ట్రం లోని బ్లూమింగ్టన్ వాస్తవ్యురాలు కళ్యాణి ముడుంబ గారు భారతీయ శాస్త్రీయ సంగీత సమాజానికి గర్వకారణంగా కర్ణాటక సంగీతంలో (Carnatic Music) చేసిన అసాధారణ కృషికి గాను బ్లూమింగ్టన్ మేయర్ Mboka Mwilambwe గారి చేత అధికారిక ప్రకటన (Proclamation) అందుకున్నారు. ఈ గౌరవం, ఆమె ఈ గొప్ప సంగీత సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, సమాజంపై విశేష ప్రభావం చూపించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా మంజూరైంది.
కళ్యాణి ముడుంబ గారు ప్రఖ్యాత కర్ణాటిక గాయకురాలు మరియు కళ్యాణి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (Kalyani School of Music) వ్యవస్థాపకురాలిగా, సంగీతం ద్వారా సాంస్కృతిక సహకారం, సమాజ సేవ, సంగీత విద్య అభివృద్ధికి అంకితంగా పని చేస్తున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీత సంపదను పెంపొందించేందుకు, అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆమె నిరంతర కృషి ప్రత్యేకమైనది.
ఈ ప్రకటన ఆమె ప్రపంచ రికార్డులను సృష్టించిన ఘనతను గుర్తించింది. కళ్యాణి ముడుంబ (Kalyani Mudumba) గారు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నాలుగు ప్రపంచ రికార్డులు (World Records) నెలకొల్పారు. సంగీత క్షేత్రంలో తన ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా, కళ్యాణి ముడుంబ గారు సమాజ సేవలో కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు.
ఆమె నిర్వహించిన విరాళ సమర్పణ కార్యక్రమాలు బ్లూమింగ్టన్-నార్మల్ హిందూ దేవాలయం (‘అష్టోత్తర శత సంకీర్తన అర్చన’ (2023)), స్ట్యాచ్యూ ఆఫ్ యూనియన్ నిర్మాణ నిధులు (‘సుందర సేతు’ (2024)), సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ (సంజీవని 2024) వంటి అనేక ప్రాముఖ్యత గల సేవా సంస్థలకు మద్దతుగా నిలిచాయి. సంగీతం ద్వారా సమాజాన్ని ఐక్యపరచడం, సేవా దృక్పథాన్ని పెంపొందించడం ఆమె ప్రధాన లక్ష్యాలు.
మేయర్ ప్రకటన కళ్యాణి ముడుంబ గారి కర్ణాటక సంగీతం (Carnatic Music) ద్వారా సమాజాన్ని ఐక్యపరచే ప్రయత్నాలను, సేవా కార్యక్రమాలను, బ్లూమింగ్టన్ (Bloomington, Illinois) నగరంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని పెంపొందించే కృషిని ప్రశంసించింది. ఈ గౌరవం, సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలను గుర్తించడానికి ఒక గొప్ప గుర్తింపు.
ఈ గౌరవాన్ని స్వీకరించిన సందర్భంగా, కళ్యాణి ముడుంబ (Kalyani Mudumba) గారు “సంగీతం సమాజాన్ని ఐక్యపరచగలిగే గొప్ప శక్తి. ఈ గౌరవాన్ని పొందడం ఎంతో సంతోషంగా ఉంది. నా శిష్యులు, అనుచరులు, సంగీతం ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ దీన్ని అంకితమిస్తున్నాను.” అని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రకటన కళ్యాణి ముడుంబ (Kalyani Mudumba) గారి వ్యక్తిగత విజయమే కాకుండా, కర్ణాటక సంగీతాన్ని (Carnatic Music) విశ్వవ్యాప్తం చేయడానికి చేసిన కృషికి ఒక గొప్ప గుర్తింపు. ఆమె ప్రయత్నాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.