24వ తానా మహాసభలు జులై 3,4,5 తేదీలలో నోవై (Novi, Detroit) సబర్బన్ షోప్లేస్ లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. దీని ఏర్పాట్లలో భాగంగా, మార్చి 8, శనివారం ఉదయం సర్వ కమిటీ (Convention Committees) సమావేశం జరిగిందని, ఇందులో 25 కమిటీలకు చెందిన షుమారు 90 మంది సభ్యులు పాల్గొన్నారని మహాసభల కన్వీనర్ ఉదయ కుమార్ చాపలమడుగు (Uday Kumar Chapalamadugu) తెలియచేశారు.
ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లను సమీక్షించి, రాబోయే నాలుగు నెలలలో చెయ్యవలసిన పనుల ప్రణాళికను సిధ్ధం చేశామని అన్నారు. వివరాల్లోకి వెళితే, ఏప్రిల్ నుంచి అన్ని తానా రీజియన్లలో ధీంతానా (DhimTANA) మరియు ఆటలపోటీలు నిర్వహించనున్నారు. పలు కమిటీలు తలపెట్టిన కార్యక్రమాలు సేకరించి, తగిన విధంగా వేదికలోని వసతులను సమీక్షించనున్నారు.
ఇప్పటికే రెండు హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న తానా (TANA), మరో రెండు హోటల్స్ ను పరిగణించనుంది. దాదాపు 3,000 మంది ఒకేసారి భోజనం చేసేందుకు అనువుగా భోజనశాలను ప్లాన్ చెయ్యనున్నారు. ఇప్పటికే డోనార్ కాటగిరీలను ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ కమిటీ, అందుకు అనువుగా వెబ్ సైట్ తయారుచేసి, మార్చి 12వ తేదీన అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
గత అక్టోబర్ మాసంలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో దాతలు 3 మిలియన్ డాలర్లకు హామీ ఇచ్చారని, వారిని ఆశ్రయించి కనీస నిధులు (Funds) రాబట్టడం, అందరినీ ప్రోత్సహించి రిజిస్ట్రేషన్ (Registration) చేయించటం, మహాసభలకు ఆహ్వానితులను (Celebrities) నిర్ణయించటం అనే మూడు ప్రధాన విషయాలపై దృష్టి సారించి మార్చి నెలాఖరుకు పూర్తి చేయ్యాలని కమిటీలను ఈ సమావేశంలో కోరారు.
మహాసభలకు ప్రముఖులను ఆహ్వానించటానికి ఇప్పటికే మహాసభల ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ళ (Gangadhar Nadella) ఇండియా చేరుకున్నారని, ఇతర తానా నాయకులు, మహాసభల కోర్ కమిటీ సభ్యులు ఇంకో రెండు వారాల్లో ఇండియా వెళ్ళనున్నారని తెలిపారు.
మళ్ళీ ఏప్రిల్ నెలలో కలిసి పురోగతి సమీక్షిద్దామని, ఎటువంటి వదంతులు నమ్మకుండా మహాసభల ఏర్పాట్లపై దృష్టి సారించాలని, 24వ తానా మహాసభలు (Convention) అనుకున్న విధంగా ఘనంగా జరుగుతాయని తెలిపి మహాసభల కన్వీనర్ ఉదయ కుమార్ చాపలమడుగు (Uday Kumar Chapalamadugu) సమావేశాన్ని ముగించారు.