Connect with us

Literary

నా భాషే నా శ్వాస; పసి ప్రాయం నుండే తల్లి భాష ఎలా? TANA ప్రపంచ సాహిత్య వేదిక

Published

on

Dallas, Texas, USA: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21)’ సందర్భంగా “నా భాషే నా శ్వాస” (పసి ప్రాయం నుండే పిల్లలకు దేశ, విదేశాలలో తల్లి భాష ఎలా నేర్పుతున్నారు?) అనే కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu) పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలికి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ (International Mother Language Day) శుభాకాంక్షలు తెలియజేసి సభను ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ – అప్పటి తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) లో ‘బెంగాలీ భాష’ అధికార గుర్తింపు కోసం 1952లో ఫిబ్రవరి 21న పాకిస్తాన్ ప్రభుత్వ తూటాలకు బలి అయిన వారి స్మారకంగా ఫిబ్రవరి 21వ తేదీని ఐక్య రాజ్య సమితి ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించిందని గుర్తుచేశారు.

మాతృభాషలో సరైన పునాది ఏర్పడిన తర్వాతే ఆంగ్లం లేదా ఇతర భాషలను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి వీలు కల్గుతుందనే వాస్తవాన్ని విస్మరించకూడదని, ఆంగ్ల భాష మోజులోపడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని, ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం భాగస్వాములు కావాలని డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) పిలుపునిచ్చారు.”

ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ (Sri Padmavati Mahila Visvavidyalayam) ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమ మాట్లాడుతూ – “పిల్లలు పసి వయస్సులో తన తల్లి, కుటుంబసభ్యుల వాతావరణంలో మాతృభాషను వినికిడి ద్వారా, అనుకరణ ద్వారా, గమనించడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని ఆ పరిస్థితులను కల్పించవలసిన బాధ్యత పెద్దల మీదే ఎక్కువగా ఉంటుంది అన్నారు. చాలా అర్ధవంతమైన, అవసరమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తానా (TANA) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులకు, పాల్గొన్న విశిష్ట అతిథులకు అభినందనలు తెలియజేశారు.”

విశిష్ట అతిథులుగా – శ్రీ పరవస్తు ఫణి శయన సూరి, ‘తెలుగుదండు’-విశాఖపట్నం; శ్రీ మణికొండ వేదకుమార్, ‘బాలచెలిమి’, ‘దక్కన్ లాండ్’–హైదరాబాద్; శ్రీ ఏనుగు అంకమ నాయుడు, ‘సాహిత్యాభిలాషి’, ‘సంఘసేవకులు’–తిరుపతి; డా. మురహరరావు ఉమాగాంధీ, ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కార గ్రహీత, విశాఖపట్నం; శ్రీమతి జ్యోతిర్మయి కొత్త, ‘పాఠశాల’-షార్లెట్, నార్త్ కరోలినా, అమెరికా; శ్రీ ఫణి డొక్కా, ‘అంతర్జాతీయ తెలుగు బడి’-అట్లాంటా, జార్జియా, అమెరికా; శ్రీ వెంకట రామారావు పాలూరి, సిలికానాంధ్ర ‘మనబడి’-డాలస్, టెక్సస్, అమెరికా; శ్రీ రవిశంకర్ విన్నకోట, ‘పాఠశాల’-కొలంబియా, సౌత్ కరోలినా, అమెరికా; శ్రీ భానుప్రకాష్ మాగులూరి, తానా ‘పాఠశాల’-వర్జీనియా, అమెరికా; మరియు శ్రీమతి ఇందిర చెరువు, తెలుగు సాంస్కృతిక సమితి ‘తెలుగు బడి’-హ్యూస్టన్, టెక్సస్, అమెరికా పాల్గొని పిల్లలకు తెలుగుభాషను నేర్పడంలో వారు అనుసరిస్తున్న వినూత్న విధానాలను, సాధిస్తున్న ఫలితాలను సోదాహరణం గా వివరిస్తూ, తల్లిభాషను భావితరాలకు అందించడంలో తల్లిదండ్రుల శ్రద్ధ, ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో అవసరం అన్నారు.

తానా (Telugu Association of North America – TANA) సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ (Chigurumalla Srinivas) ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన కార్యకర్తలకు, ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‌

error: NRI2NRI.COM copyright content is protected