వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) 2025 సంవత్సరానికి అధ్యక్షునిగా రాజేశ్ గూడవల్లి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజేశ్ గూడవల్లి అనే నేను… అంటూ సాగిన ఈ కార్యక్రమానికి 150కి పైగా సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, మరియు చిన్నారులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు.
వారందరూ ఆనందకరమైన వాతావరణంలో పాల్గొని, రుచికరమైన భోజనాలను ఆస్వాదించి, కొత్త బోర్డును అభినందించారు. ఈ ప్రత్యేక సందర్భంలో కొత్త బోర్డు (WATS 2025 Board) సభ్యులు మధు రెడ్డి, ప్రకాష్ కొండూరు, రామ్ తమ్మినేని, హరిని దేశరాజు, శివ వేదురుపాటి, శ్రీరామ్ పాటిబండ్ల ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజేశ్ గూడవల్లి పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు పూర్వాధ్యక్షులకు మద్దతు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్వాధ్యక్షులు శ్రీనివాస్ అబ్బూరి (Srinivas Abburi), వంశీ రెడ్డి (Vamshi Reddy Kancharakuntla), జయపాల్ రెడ్డి దొడ్డ, హరి ఎక్కాలి, భాస్కర్ గంగిపాముల, రామ్ పాలూరి (Ram Paluri), షకీల్ పొగకు, రామ్ కొట్టి తదితరులు పాల్గొని రాజేశ్ గూడవల్లి గారిని అభినందించి, సమితి అభివృద్ధి కోసం తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రమాణ స్వీకారం అనంతరం, కొత్త బోర్డు సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నవారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సభ్యుల నుంచి వచ్చిన సూచనలను, అభిప్రాయాలను నోట్స్ రూపంలో తీసుకోని వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు తన టీమ్ కట్టుబడి ఉందని రాజేశ్ గూడవల్లి (Rajesh Gudavalli) తెలిపారు.
వాట్స్ నూతన అధ్యక్షులు రాజేశ్ గూడవల్లి మాట్లాడుతూ… యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా యువత బోర్డును ఏర్పాటు చేయడం, మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలను నిర్వహించడం, వాషింగ్టన్ రాష్ట్రం (Washington State) లో తెలుగు సాంస్కృతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం, సమాజ అభ్యున్నతికి నూతన కార్యక్రమాలకు నిధులను సేకరించడం వంటి ప్రణాళికలను ప్రకటించారు.
రాజేశ్ గూడవల్లి (Rajesh Gudavalli) తన కొత్త బాధ్యతలను స్వీకరించిన సందర్భంలో కృతజ్ఞతలను తెలియజేస్తూ, “మీ అందరి నమ్మకాన్ని గౌరవిస్తూ సమితి అభ్యున్నతికి కృషి చేస్తాను” అని అన్నారు. వాట్స్ (Washington Telugu Samithi – WATS) బోర్డు ప్రస్తుత అధ్యక్షురాలైన సునీత కొత్తపల్లి (Sunitha Kothapalli) కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుక వాషింగ్టన్ తెలుగువారి ఐక్యత, సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తూ, అందరికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది. రాజేశ్ గూడవల్లి మరియు కొత్త బోర్డు సభ్యులు తమ బాధ్యతలను స్వీకరించిన తరువాత, Washington Telugu Samithi (WATS) యొక్క అభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలను ప్రకటించారు.
అలాగే వారి నిర్ణయాలు మరియు సేవా కార్యక్రమాలు తెలుగు ప్రజల కోసం మరింత భాగస్వామ్యాన్ని, ఐక్యతను ప్రోత్సహిస్తాయని రాజేశ్ గూడవల్లి గారు స్పష్టం చేశారు. రాజేశ్ గూడవల్లి మరియు 2025 కార్యవర్గానికి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే WATS విజయాలను కొనసాగిస్తూ, వాషింగ్టన్లో తెలుగువారి ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు.