ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 208వ సాహిత్య సదస్సు ”తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు” అంశంపై నవంబర్ 24న డాలస్ పురము (Dallas Puram) నందు ఘనంగా నిర్వహించబడింది.శ్రీ లెనిన్ వేముల “హిమగిరి తనయే హేమలతే” ప్రార్ధనా గీతంతో సభారంభమయ్యింది. పాలక మండలి సభ్యులు మరియు సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ దయాకర్ మాడా (Dayakar Mada) స్వాగతోపన్యాసం చేసి,’మాసానికో మహనీయుడు’ శీర్షిక లో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పాండిత్య ప్రతిభావిశేషాలను సభకు పరిచయం చేశారు.
‘మన తెలుగు సిరి సంపదలు’ శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి (Dr NarasimhaReddy) ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula) గారు గుర్రం జాషువా (Gurram Jashuva) ”గబ్బిలం” పద్య గానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తరువాత ప్రముఖ రచయిత శ్రీ సత్యం మందపాటి గారు శ్రీ మధురాంతకం రాజారాం గారి తోనూ,శ్రీ నరేంద్ర గారితోనూ తన జ్ఞాపకాలను పంచుకొన్నారు. మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు శ్రీ భాస్కర్ పులికల్ గారు శ్రీ మధురాంతకం రాజారామ్ గారితో తన అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు తన బావ శ్రీ మధురాంతకం నరేంద్ర గారితో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించడం జరిగింది .
నేటి ముఖ్య అతిథి ఆచార్య మధురాంతకం నరేంద్ర (Madhurantakam Narendra) మాట్లాడుతూ తన తండ్రి శ్రీ మధురాంతకం రాజారాం (Madhurantakam Rajaram) తెలుగు, ఆంగ్ల భాషలలో రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని తాను విద్యార్థి దశలోనే కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు.కథ చదివే ప్రతి వ్యక్తిలో తద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్ష గా పేర్కొన్నారు.తన తండ్రి పేరు మీదుగా ”కథాకోకిల” అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు.
భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరిగిన జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడుఅనీ రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందనీ తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినపుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చునన్నారు. మననుండి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి, నాగర్ కోయిలు, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు, మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు, ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికముగా ఉందన్నారు.
తెలుగు తమిళ భాషలు రెండూ వారి దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో వ్రాయడమే ఉత్తమ విధానమని అన్నారు.తరువాత శ్రీ మధురాంతకం రాజారామ్ (Madhurantakam Rajaram) గారితో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి (Dr. Boyareddy) గారు సాహితీ ప్రియులతో పంచుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura), ఉపాధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి , శ్రీ చంద్రహాస్ మద్దుకూరి,డాక్టర్ కోట సునీల్ ,శ్రీ గోవర్ధనరావు నిడిగంటి శ్రీ నరేంద్ర గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru), తదుపరి అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి (Chandrasekhar Reddy Pottipati), పాలకమండలి ఉపాధిపతి శ్రీ హరి సింఘం మరియు సంస్థ సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది.
ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ ఆచార్య మధురాంతకం నరేంద్ర తన కృతజ్ఞతను వెలిబుచ్చారు.సభలో ప్రత్యక్షంగా మరియు అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు (Literary Scholars) పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది.
శ్రీ దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.