ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితమే అమెరికా సిటీ కౌన్సిల్ సభ్యుల నియామకం జరగడం, ఇంతలోనే మోహన్ కృష్ణ ని కొత్త పదవి వరించడం చూస్తుంటే నిబద్దతో ఫుల్ టైం పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపునివ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటదనే ఒక క్లియర్ మెసేజ్ ప్రవాసులకు పంపినట్లైంది.
గుంటూరులో చదువుకునే రోజుల్లోనే తెలుగు విద్యార్థి మరియు తెలుగు యువత విభాగాల్లో మోహన్ కృష్ణ చురుకుగా పనిచేశారు. విద్యాభ్యాసం అనంతరం అమెరికాలో వ్యాపార రంగంలో స్థిరపడిన మోహన్ కృష్ణ ఎన్నారై టీడీపీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నారై టీడీపీ విభాగ పటిష్ఠతకు ఎనలేని కృషి చేశారు. అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాలలో ఒకటైన నాట్స్ కి అధ్యక్షులుగా వ్యవహరించారు. అమెరికా జాతీయ తెలుగు సంఘాలకు అధ్యక్షులుగా విధులు నిర్వహించిన వారిలో అందరికంటే పిన్న వయస్కుడు మన్నవ మోహన్ కృష్ణ.
ఒకవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ గా కొనసాగుతూ, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు అమెరికాలో నిధులు సేకరించడంలో కీలకంగా వ్యవహరిస్తూ మోహన్ కృష్ణ నారా చంద్రబాబు నాయుడు మరియు నందమూరి బాలకృష్ణ లకు ఎంతో ఆప్తుడు అయ్యారు. నాట్స్ అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుల కోసం మరియు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తిగా మోహన్ కృష్ణ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపారపరంగా విదేశాల్లో ఉన్నప్పటికీ తన స్వస్థలం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు నిత్యం కృషిచేస్తున్నారు. 2019 లో టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మోహన్ కృష్ణ పేరు ముందంజలో ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీటు దక్కలేదు. టీడీపీ అధిష్టానం సీటు కేటాయించక పోయినా 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు మోహన్ కృష్ణ ఎంతో కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాష్ట్ర టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మోహన్ కృష్ణ సేవలకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉత్తర్వులు జారీ చేసింది.
మోహన్ కృష్ణ నియామకం పట్ల పార్టీ శ్రేణులు, ప్రవాసుల హర్షం: స్వదేశం లోనూ, విదేశాల్లోనూ టీడీపీ పటిష్టతకు అహర్నిశలు పాటుపడుతున్న మోహన్ కృష్ణ కు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు మోహన్ కృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ మాట్లాడుతూ పదవులతో నిమిత్తం లేకుండా టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడమే తన ధ్యేయమన్నారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను పార్టీ శ్రేణుల సహకారంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ టీడీపీ బలోపేతానికి చిత్తశుద్ధిగా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ లకు మన్నవ మోహన్ కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.