అమెరికా రాజధాని మెట్రో (Washington DC) ప్రాంతంలో 1500 మంది తెలుగు వారి సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రవాస సంస్థ తానా మరియు టీ.టీ.డి (Tirumala Tirupati Devasthanams) దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
వందలాది మంది తెలుగు వారు సుమారు 250 జంటలుగా పాల్గొని ఆ దేవదేవుని కళ్యాణాన్ని ఆద్యంతం తిలకించారు. ఆ ప్రాంగణమంతా గోవిందా నామ స్మరణతో మారుమోగిపోయింది. రోజంతా తిరుమల (Tirumala) కొండపై ఉన్నామా.. అన్న అనుభూతిని కలిగిందని భక్తులు, పెద్దలు తెలిపారని నిర్వాహకులు, తానా రాజధాని ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింతా (Sateesh Chinta) తెలిపారు.
పూర్తిగా శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో.. సంప్రదాయ, ఆచారాలను చక్కగా పాటిస్తూ తిరుమల దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) నుండి విచ్చేసిన ప్రధానార్చకులు పాల్గొని కళ్యాణం నిర్వహించగా.. స్థానిక భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు దంపతులుగా పాల్గొన్నారు.
ఉదయం నుండే పిల్లలు,పెద్దలు, మహిళలు పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి.. గోవిందా నామం స్మరిస్తూ.. అర్చకులు సూచించిన విధంగా పూజ సామగ్రిని సిద్ధం చేసుకొని కళ్యాణ మహోత్సవంలో (Sri Srinivasa Kalyanam) పాలుపంచుకున్నారు.
ప్రవాస భారతీయ సంస్థ తానా (TANA) పిలుపు.. యువతే మన వారసత్వ ఆస్తి.. అన్న రీతిలో వందలాది మంది యువత భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అమెరికాలో నేటి తరం తెలుగు చిన్నారులకు, యువతకు మన భాష, సంప్రదాయం, ఆధ్యాత్మిక దైవ చింతనను ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అవసరమని.. పలువురు పెద్దలు, భారతీయులు అభిప్రాయపడ్డారు.
రాజధాని ప్రాంత (Washington DC) యువత వాలంటీర్లుగా (Volunteers) పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయటాన్ని తానా (Telugu Association of North America) ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి (Naren Kodali) అభినందించారు. స్థానిక పెద్దలు, పలువురు తానా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.