అమెరికాలోని ఫ్లోరిడా (Florida) రాష్ట్రము, జాక్సన్విల్ (Jacksonville) నగరంలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. “తాజా” (జాక్సన్విల్ తెలుగు సంఘం) అధ్యక్షులు శ్రీ మల్లి సత్తి (Malleswara Satti) గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలకు జాక్సన్విల్ మరియు సెంట్ జాన్స్ (Saint Johns) జంట నగరాల ప్రవాస తెలుగు కుటుంబ సభ్యులు దాదాపుగా 1300 మంది వరకు హాజరయినారు.
తెలంగాణ (Telangana) సంస్కృతి, సాంప్రదాయాలని ప్రకటించే బతుకమ్మ పండుగను మహిళలందరూ సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. తాజా (TAJA) కార్యవర్గ సభ్యులు ఏడడుగుల బతుకమ్మను తయారు చేసినారు. శ్రీమతి పల్లవి పాల్వాయి గారి ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించినారు.మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయిన ఉత్సవాలు, రాత్రి 10 గంటల వరకు నిర్వాహకులు ఆద్యంతం అద్భుతంగా నిర్వహించినారు.
జాక్సన్విల్లే (Jacksonville) పురోహితులు “పురోహిత బ్రహ్మ” శ్రీమాన్ శ్రీ శ్రీనాధ్ గారు సాంప్రదాయ బద్దంగా గౌరీ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.జాక్సన్విల్ నగరంలో స్థిరపడిన తెలుగు ఆడపడుచులందరూ, రంగురంగుల పూలను అందంగా పేర్చి, వాటిపైన గౌరమ్మని పెట్టి, దీపపు వెలుగులలో, అగరవత్తుల వాసనలతో ఇంటి దగ్గర పూజలు చేసి, బతుకమ్మ నిర్వహిస్తున్న Greenland Pines పాఠశాలకు తీసుకొనివచ్చినారు.
శ్రీమతి శ్యామల పొలాటి గారు, లక్ష్మి చంద్రశేఖర్ గారు వేసిన రంగు రంగుల రంగవల్లి చుట్టు, తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను చేర్చినారు. కార్యక్రమానికి మహిళలు, పిల్లలు సాంప్రదాయ దుస్తులు వేసుకొని రకరకాల ఆభరణాలు ధరించి వచ్చినారు.ఈ కార్యక్రమాన్ని కలకాలం మదిలో దాచుకోవడానికి, మూడు ప్రత్యేక Phot Booth లను ఏర్పాట్లు చేరినారు.
శ్రీ ముకుందన్ గారు అలంకరించిన అమ్మవారి విగ్రహంతో ఒక Photo Booth, పల్లెవాతావరణం ఉట్టిపడేలా రెండు Photo Booth లను ఏర్పాటు చేసినారు.మహిళలందరూ భక్తిశ్రద్దలతో బతుకమ్మ పాటలతో, చప్పట్లు కొడుతూ, వలయాకారంలో తిరుగుతూ సందడి చేసినారు. కార్యక్రమం నిర్వహించిన Greenland Pines Elementary పాఠశాల ప్రాంగణమంతా బతుకమ్మ పాటలతో మార్మోగినది.
ప్రత్యేక అతిధులుగా వచ్చిన కేరళ వాయిద్య బృంద కళాకారులు చేసిన అద్భుత లయ విన్యాసం కొంత సేపు అతిధులను ఆకర్షించినది.పసుపుతో చేసిన గౌరమ్మను (Bathukamma) పూజించి ముత్తైదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తాజా కార్యవర్గం వారు ప్రతి ఆడపడుచుకు తాంబూలం అందించారు.ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి, వాటిని తెచ్చిన ఆడపడుచులకు స్రవంతి మల్లి సత్తి గారు, రాధిక భీమిరెడ్డి గారు, సరితా రెడ్డి గారు బహుమతులను అందచేసినారు.
తొలి ఐదు స్థానాల్లో నిలిచిన విజేతలు వరుసగా శ్రీమతి శృతిక నర్సన్న మదాడి, శ్రీమతి ఇందు సురేష్ చెంచల, శ్రీమతి లహరిక వెంకట్ రెడ్డి, శ్రీమతి ప్రత్యూష అబ్బరాల, శ్రీమతి సుధా మెరుగు.ప్రతి ఇంటి నుండి ఒక బతుకమ్మ (Bathukamma) రావాలని, ఈ పూల పండుగను అందరూ చేసుకోవాలని, మొదటి ఐదుగురికే కాకుండా 14 మంది ఆడపడుచులకు తాజా కార్యవర్గ సభ్యులు ప్రోత్సాహక బహుమతులను (Prizes) అందచేసినారు.
ఇదే కార్యక్రమములో దసరా పండుగను (Dussehra Festival) కూడా జరుపుకున్నారు. స్వదేశం నుండి తెచ్చిన జమ్మి ఆకును ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకొని అలయ్- బలయ్ తో శుభాకాంక్షలు చెప్పుకున్నారు.చివరగా డప్పు చప్పుళ్లు, కేరింతలతో బతుకమ్మలను గంగ ఒడ్డుకు చేర్చి “బతుకమ్మ – మమ్మల్ని చల్లగా బతికించమ్మ” అంటూ వేడుకుంటూ Greenland Pines Elementary పాఠశాల కొలను నీటిలో నిమజ్జనం చేసినారు.
వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మలు (Bathukamma) ఆడుతుంటే, తాజా కార్యవర్గంలోని మగవారందరు వంటలు వండి, వడ్డించారు. ఉదయం నుండి నిర్విరామంగా శ్రమించి, కరివేపాకు కారం, గోంగూర పచ్చడి, పచ్చిపులుసు, చపాతీలు, నాలుగు రకాల అన్నం, నాలుగు రకాల కూరలు, రెండు రకాల తీపి పదార్ధాలను తయారు చేసినారు.
అతిధులందరిని కడుపు నిండా తినేలా ప్రోత్సహిస్తూ, అందరికీ అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోగ్యమైన పండుగ భోజనాన్ని (Festive Dinner) పిల్లలకు అందించాలని, పిల్లలకోసం కొన్ని ప్రత్యేక వంటలు చేసినారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడూ గంటల వరకు ఫలహారాలు, తేనీరు అందించారు. ఈ సంవత్సరం “తాజా కార్యవర్గం” వారే బోజనాలను స్వయంగా వండటం అందరిని ఆకట్టుకుంది.
ఈ వేడుకల్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజనాలన్నీ అద్భుతంగా ఉన్నాయని, వంటలు చేసిన తాజా (Telugu Association of Jacksonville Area – TAJA) కార్యవర్గ సభ్యులను బతుకమ్మ (Bathukamma) ఆడిన మహిళలందరూ అభినందించారు.ఈ కార్యక్రమాన్ని తిరుమల అంబూరి, రాజ్ కమల్ సుట్టి , కిరణ్ కుమార్ తన కెమెరాలో బంధించారు.
ఈ కార్యక్రమానికి తాజా (Telugu Association of Jacksonville Area – TAJA) కార్యవర్గ సభ్యులతో పాటు ప్రియ ఆకుల, రాగ సుధ, లావణ్య సారిపల్లి, శ్రీదేవి ముక్కోటి, లహరిక బచ్చనగారి, జ్యోత్స్న కొచ్చెర్లకోట, లావణ్య గంధి, నారాయణ కసిరెడ్డి, ఉపేందర్ రత్నం, శ్రీకాంత్ బిక్కవళ్లి, సుధీర్ మేడపాటి, భువన్ కలపల్లి సహాయ సహకారాలు అందించి, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడానికి కృషి చేసినారు.
తాజా (Telugu Association of Jacksonville Area – TAJA) అధ్యక్షులు శ్రీ మల్లి సత్తి (Malleswara Satti) గారు అధ్యక్షోపన్యాసం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదములు తెలియచేసినారు.బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడానికి సహాయ సహకారాలు అందించడంతో పాటు వెయ్యి లడ్డులు అందించిన శృతిక నర్సన్నలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసినారు.
సాయి బాబా గుడి ఆవరణలో వంటలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన గుడి కార్యవర్గ సభ్యులకు దన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిల్చిన శ్రీమతి శ్రీ శైలజ రవి బండారు, ధను ముద్రాతి (Peaky Blinds), శ్యామల పొలాటి (Peacock Event Decors) మరియు శిరీష పోకల (Trendy Collections) వారికి తాజా కార్యవర్గ సభ్యులు ధన్యవాదములు తెలియచేసినారు.