Connect with us

Health

అర్జున్‌ ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహణ; Virginia బుడతడు @ Penamaluru, Krishna District

Published

on

అమెరికాలోని వర్జీనియా (Virginia) లో 10వ తరగతి చదువుతున్న అర్జున్‌ పరుచూరికి చిన్ననాటి నుంచే పలువురికి సేవ చేయాలన్న తపన ఉండేది. ఈ నేపథ్యంలో జన్మభూమిపై మమకారంతో తన నాయనమ్మ స్వస్థలమైన పెనమలూరులో తనవంతుగా సేవలందించాలని భావించి, ముఖ్యంగా వైద్య విషయాలపై అక్కడ ఉన్న తనతోటి విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు.

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) తోడ్పాటుతో ఆగస్టు 13వ తేదీన అర్జున్‌ పరుచూరి పెనమలూరు (Penamaluru) లోని జడ్‌ పి హైస్కూల్‌ లో సిపిఆర్‌ (CPR), మానసిక ఆరోగ్యం, పోషకాహారం (Healthy Diet) వంటి ముఖ్యమైన విషయాలపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించి, విద్యార్థులందరికీ స్వయంగా డెమో ఇచ్చి అవగాహనను కల్పించాడు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సిపిఆర్‌పై శిక్షణ ఇవ్వడంతోపాటు వారిచేత ప్రాక్టికల్‌గా కూడా చేయించి చూపించాడు.

అలాగే గంజాయి వంటి మత్తు పదార్ధాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, వాటికి దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని తెలియపరిచాడు. ఆరోగ్యంపై సరైన అవగాహనతో ఉంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో అర్జున్‌ తోపాటు ఆమె తల్లి డా. నాగమల్లిక జాస్తి కూడా పాల్గొని సిపిఆర్‌ విధానాల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సరైన సమాధానాలు ఇవ్వడంలో సహాయం అందించారు. అలాగే డెమోలో కూడా సహకరించారు.

తానా ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ ఎండూరి, తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్ ‌ మల్లినేని (Tagore Mallineni), డాక్టర్‌ ఓ.కె. మూర్తి ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కిలారు శివకుమార్‌, పెనమలూరు జడ్‌ పి హైస్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయురాలు దుర్గా భవాని తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.

పెనమలూరు జడ్‌ పి హైస్కూల్‌ (Penamaluru ZP High School) విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు అర్జున్‌ పరుచూరి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ పద్మరాణి, ఎంఈఓ కనకమహాలక్ష్మి, పెనమలూరు ఎన్నారై స్థానిక ప్రతినిధి సుధీర్ పాలడుగు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected