అమెరికాలో తెలుగు వారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే తాజాగా ఏలూరు (Eluru) జిల్లా వట్లూరు గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది.
నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల (Bhanu Prakash Dhulipalla) చొరవతో నాట్స్, ఏలూరు హేలపుర రూరల్ లయన్స్ క్లబ్ సంస్థలు సంయుక్తంగా ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఆయుష్ హాస్పిటల్స్, శంకర్ నేత్రాలయల సహకారంతో ఈ ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ మెగా వైద్య శిబిరంలో దాదాపు 160 మంది రోగులకు ఉచితంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. శంకర్ నేత్రాలయం కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య శిబిరం (NATS Free Mega Health Camp) లో ఉచితంగా మందులు కూడా రోగులకు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్యం గురించి ఈ శిబిరంలో వైద్యులు విలువైన సూచనలు చేశారు.
పేద రోగుల కోసం ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సొంత డబ్బులతో నిర్వహించిన నాట్స్ (North America Telugu Society) వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల ను స్థానికులు అభినందించారు. సొంత ఊరుకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేద రోగులకు ఉపయోగపడేలా చేయడంపై రోగులు ప్రశంసల వర్షం కురిపించారు.
నాట్స్ (NATS) మెగా వైద్య శిబిరం నిర్వహణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరానికి సహకరించిన నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు, మురళీకృష్ణ మేడిచెర్లకు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.