బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangham – GWTCS) ఆధ్వర్యంలో అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా 2024 మే 18 శనివారం రోజున వందలాది మంది పెద్దలు, చిన్నారులు, మహిళల సందడితో తెలుగు ఉగాది (Ugadi) వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్యంగా ఆపాత మధురాలు – మెలోడియస్ మూమెంట్స్ పేరిట జరిగిన సంగీత విభావరి (Live Musical Night) ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని GWTCS అధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam) తెలిపారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకూ నిరంతరంగా సాగాయి.
రక రకాల వేష ధారణతో చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. తదుపరి ప్రముఖ గాయకులు SP చరణ్ (Sripathi Panditharadhyula Charan), గాయనీమణి సునీత (Sunitha Upadrashta) గార్ల ప్రత్యేక పాటల విభావరి అన్ని తరాల వారిని ఎంతో అలరించింది. ఉగాది (Ugadi Festival) పండుగ సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందును అందించారు.
GWTCS అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ… ఎల్లలు లేని తెలుగు భాష, అనాదిగా తెలుగు బాష వైభవం, కళా, సంస్కృతీ సంప్రదాయాలను సరిహద్దులను దాటించి ఈనాడు లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న అమెరికాలో సైతం ప్రతి తెలుగింటి పండుగను జరుపుకుంటూ.. ప్రాముఖ్యతను చాటుతూ.. అన్ని తరాల వారిని అలరిస్తూ, తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుంది.. ఇది సంస్థకు స్వర్ణోత్సవ సంవత్సరం (1974 – 2024) అని.. అందరి సహకారంతో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ… ఐదు దశాబ్దాల క్రితం ఎందరో పెద్దల సహాయ, సహకారాలతో మొదలైన ఈ ప్రవాస తెలుగు సంస్థ. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి ఎన్నో ప్రవాస సంఘాలకు (Telugu Associations) ఆదర్శంగా, మూలంగా నిలిచింది. స్వర్ణోత్సవ వేళ ప్రవాస సంఘాలన్నీ ఏకమై ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి మాట్లాడుతూ… సజీవమైన తెలుగు భాష (Telugu Language) ను అమెరికా (United States of America) లో సైతం ఈ తరానికి చేరువ చేసే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయం అన్నారు.
చివరిగా GWTCS సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం, కార్యవర్గ సభ్యులు కలిసి అతిధులు, ప్రముఖ గాయకులయిన SP చరణ్ (SP Charan), సునీత గార్లను ఘనంగా సత్కరించారు. కళను ప్రోత్సహించటం, కళాకారులను సత్కరించటం తెలుగింటి సంప్రదాయమని కార్యవర్గసభ్యులు చంద్ర మాలావతు, సుశాంత్ మన్నే, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, సుష్మ అమృతలూరి, పద్మజ బేవరా, గంగ శ్రీనివాస్, విజయ్, ప్రవీణ్ రాజేష్, ఉమాకాంత్, శ్రీ విద్య సోమ తెలుపారు.
GWTCS (Greater Washington Telugu Cultural Sangham) పూర్వ అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, సాయి సుధ పాలడుగు మరియు తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింత, విజయ్ గుడిసేవ, సత్య సూరపనేని పాల్గొని కార్యక్రమాలను కొనియాడారు. అలాగే స్వర్ణోత్సవాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.