Connect with us

News

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా TANTEX క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు @ Dallas, Texas

Published

on

టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) నగరంలో ఫ్రిస్కో హై స్కూల్ ఈవెంట్ సెంటర్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (TANTEX) ఆధ్వర్యంలో ‘క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 27 న ఏర్పాటు చేసిన ఈ ఉగాది వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తొలుత తన్మయీ రాయపాటి బృందం అమెరికా జాతీయ గీతాన్ని చక్కగా ఆలపించారు.

బ్రహ్మశ్రీ వరదరాజన్ గారు క్రోధి నామ తెలుగు సంవత్సర పంచాంగ శ్రవణం (Panchanga Sravanam) తో ఆహూతులందరికీ తమ ఆశీర్వచనాలు అందించారు. కల్చరల్ చెయిర్ దీపికా రెడ్డి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగత వచనాలు పలికారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులైన ఫ్రిస్కో నగర కౌన్సిల్ మెంబర్లు జాన్ కీటింగ్, ఏంజెలియ పెల్ హ్యాం, ఫ్రిస్కో ఐ యస్ డీ బోర్డు ఆఫ్ ట్రస్టీ శ్రీ గోపాల్ పోణంగి ప్రభృతులు హాజరైప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా శ్రీ దయాకర్ మాడా గారు ప్రదర్శించిన హాస్యవల్లరి స్కిట్ నవ్వులు పూయించింది. చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన మూషిక వాహన క్లాసికల్ నృత్యం, పల్లెల్లో ఉగాది పండుగ రూపకం, శివ భక్తి ని ప్రతిబింబించే నృత్యాలు, అన్నమాచార్య కీర్తన చక్కని తల్లికి క్లాసికల్ నృత్యం, చిన్నారి యువతుల జట్టుతో రూపొందించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. ప్రముఖ గాయనీ గాయకులు మాళవిక (Tollywood Singer Malavika), కారుణ్య (Karunya) లు చలన చిత్ర గానం, మెహెర్ చంటి లైవ్ బ్యాండ్ (Mehar Chanti Live Band) టాంటెక్స్ ఉగాది ఉత్సవాలకే ఓ హైలైట్.

మరీ ముఖ్యంగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ను పురస్కరించుకొని నటరాజ కల్చరల్ & ధ్యాన క్షేత్రం, డల్లాస్ కు చెందిన ప్రముఖ నృత్య దర్శకురాలు శ్రీమతి చంద్రిక యామిజాల దర్శకత్వంలో బాలలు ఇంకా మహిళలచేత అభినయింపచేసిన నృత్య రూపకం అద్భుతం. రామాయణ మహాకావ్యంలోని ఘట్టాలు హనుమంతులవారి సీతాన్వేషణ, రామ సేతు నిర్మాణం, వానరుల యుద్ధోత్సాహం, జాంబవంతుడు భక్త హనుమాన్ పరాక్రమాన్ని గుర్తించడం, శ్రీరామ లక్ష్మణుల యుద్ధకౌశలం, రావణ సంహారం, రామరాజ్య పునః స్థాపన మున్నగు అంశాలతో కూడిన ఈ అద్భుతమైన రామాయణ నృత్య రూపకం ప్రేక్షకులని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

భారత దేశములో అనేక ప్రదర్శనలిచ్చి ఇప్పుడు తన శాస్త్రీయ కళానైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నప్రముఖ రోబో కళాకారుడు రోబో గణేశన్ నేపధ్య గానం తెరవెనుక వినిపిస్తుండగా ఇచ్చిన రోబో ప్రదర్శన నభూతో నభవిశ్యతి అన్నంత అద్భుతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చును. ప్రదర్శన జరుగుతున్నంతసేపూ ప్రేక్షకులు ఉత్కంఠభరితముగా వీక్షించడం, ప్రదర్శన ముగిసిన వెంటనే రోబో గణేశన్ ను తమ కరతాళ ధ్వనులతో అభినందించడం జరిగింది.

తెలుగు వారి తొలి పండుగ క్రోధి నామ ఉగాది (Ugadi) ఉత్సవాలలో భాగంగా వివిధ రంగాలలో నిపుణులైన ప్రముఖులను సన్మానించడం జరిగింది. తెలుగు చలన చిత్రాలకు మరియు ప్రస్తుతం ఈటీవీ, మాటీవీ, జెమినీ టీవీ ల్లో విజయవంతంగా ప్రసారం చేయబడుతున్న టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తున్న శ్రీ లింగాల సంజీవ రెడ్డి గారినీ, డల్లాస్ ఫోర్ట్ వర్త్ లో ఉంటూ భారత దేశంలో ”హీల్”’ స్వచ్చంద సంస్థను ఏర్పరచి నిరుపేద మరియు అనాధ పిల్లలకు విద్య వైద్య సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కృష్ణ బాబు చుండూరి గారినీ సన్మానించారు.

అలాగే నాట్య కౌముది, నాట్య విశారద బిరుదాంకితురాలు ప్రముఖ కూచిపూడి కళాకారిణి శ్రీమతి కల్యాణి ఆవుల గారినీ, టాంటెక్స్ (TANTEX) సంస్థ పూర్వ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ గా సేవలందించి, నిర్మాణ రంగం తోపాటు అనేక సేవా రంగాల్లో ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రముఖ ఇంజినీరు శ్రీ సత్యం కళ్యాణ్ దుర్గ్ గారినీ, కథలు, చలన చిత్రాల్లో పాటలు వ్రాసి సినీ జగత్తులో పేరెన్నిక గన్న శ్రీ తనికెళ్ళ శంకర్ గారినీ, తేజస్విని కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తేజస్వి సుధాకర్ గారినీ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆహూతులకు రుచికరమైన భోజన వసతులను సమకూర్చడంలో విశిష్ట సేవలందిందిస్తున్న శ్రీ రాజేష్ శొంఠి గారికీ, ఎన్ ఎన్ టీవీ & మీడియా సాహిత్య సేవలు అందిస్తున్న గోవర్ధన రావు నిడిగంటి గారికీ టాంటెక్స్ ”బెస్ట్ వాలంటీర్” అవార్డును అందచేయడం జరిగింది. శ్రీ రవి తూపురాని, మైత్రేయి మియపురం వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది.

సాంస్కృతిక చెయిర్ గా దీపికా రెడ్డి వ్యవహరించగా, ఈవెంట్ కోఆర్డినేటర్ గా దీప్తి సూర్యదేవర చక్కటి ఆచరణాత్మక ప్రణాళికతో ప్రతి ఒక్కరు సమయపాలన పాటించేలా ఆద్యంతం ముందుండి నడిపించారు. డల్లాస్, టెక్సాస్ లో రుచికరమైన వంటకాలకు పేరెన్నికగన్న ఫుడి స్టాన్ (Foodistaan) వారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహూతులందరికీ షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగింప చేశారు. టాంటెక్స్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees), పాలక మండలి సభ్యులు వారి కుటుంబ సభ్యులు టాంటెక్స్ నూతన తెలుగు ఉగాది ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తానా (TANA) మరియు టాంటెక్స్ (TANTEX) సంస్థ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నల గడ్డ, శ్రీ చిన్న సత్యం వీర్నపు, శ్రీ మూర్తి ములుకుట్ల, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్, శ్రీ దయాకర్ మాడా, శ్రీ లెనిన్ వేముల, శ్రీమతి కిరణ్మయి గుంట, శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు వంటి సాహితీ ప్రియులే కాక టాంటెక్స్ సంస్థ ను విజయ పథాన నడిపిస్తున్న శ్రీ యర్రం శరత్ రెడ్డి, శ్రీ చంద్రశేఖర రెడ్డి పొట్టిపాటి, శ్రీమతి మాధవి లోకిరెడ్డి, శ్రీ ప్రవీణ్ బాలిరెడ్డి, శ్రీ ఉదయ్ కిరణ్ నిడిగంటి, శ్రీ సునీల్ సురపురాజు, శ్రీ లక్ష్మి నరసింహ పోపూరి హాజరయ్యారు.

ఇంకా నాట్స్ (NATS) అధ్యక్షులు శ్రీ బాపు నూతి, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టరు శ్రీ రాజేంద్ర మాదాల, సిలికానాంధ్ర (Silicon Andhra) వ్యవస్థాపకులు శ్రీ ఆనంద్ కూచిభొట్ల, ప్రసాద్ జోస్యుల, చెన్నూరి వీ సుబ్బారావు ఇంకా తెలంగాణ ప్యూపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వంటి స్థానిక తెలుగుసంస్థ ల ప్రతినిధులతో పాటు ప్రపంచ వ్యాప్త తెలుగు సంస్థలైన నాటా (NATA), తానా వంటి సంస్థల నుండి అనేక మంది ప్రముఖులు హాజరవడంతో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు విజయవంతమైనాయి.

ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, TANTEX అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru) మాట్లాడుతూ.. దాదాపు నలభై ఏళ్ళక్రితం డల్లాస్ (Dallas, Texas) కేంద్రంగా విద్య ఉద్యోగాల కోసం మాతృదేశాన్ని వదిలి వచ్చిన తెలుగువారు అంతా ఒక్కటై తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకొనడం కోసం 1986 లో టాంటెక్స్ సంస్థను ఏర్పాటుచేసుకున్నారనీ, ఘనమైన చరిత్ర గల ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ వేడుకలు నిర్వహించాలని తలపెట్టిన ప్పటినుండీ రిజిస్ట్రేషన్, వెండర్ బూత్స్, భోజన సదుపాయాల కల్పన కోసం గత రెండు నెలల నుండీ అహర్నిశలు శ్రమించిన టాంటెక్స్ (TANTEX) పాలక మండలి మరియు కార్య నిర్వాహక బృందం సభ్యులకు మరియు వాలంటీర్లకు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ 2024 చైర్మన్ సురేష్ మండువ (Suresh Manduva) మరియు కో-చెయిర్ హరి సింగం కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియ చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected