పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి సాహిత్యం గురించి చెప్పాలంటే మొట్టమొదట చెప్పాల్సింది “మునివాహనుడు” నాటకం. వీరు రాసిన ఈ ఫిక్షన్ నాటకం ఇప్పుడు మన సమాజంలో “మునివాహన సేవ” గా ప్రసిద్ధి చెందింది. ఇనాక్ గారు పొందిన వందలాది అవార్డుల గురించి ప్రస్తావించాలంటే కూడా ఇక్కడ ఇచ్చిన కాలపరిమితి సరిపోదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్ మూర్తీదేవి అవార్డు లు, రాష్ట్ర స్థాయిలో సాహిత్య అకాడమీ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే జీవిత సాఫల్య పురస్కారం.
ఆయన మూడు భాషల్లో అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రచించాడు. ఆయన రచనలు చాలా ఇతర భాషల్లోకి కూడా అనువదింపబడ్డాయి. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పాఠ్యాంశాలుగా చదువుకుంటున్న సాహిత్యం ఎవరిదన్నా ఉందా అంటే ఇనాక్ గారు ముందు వరసలో ఉంటారు. అందుకే ఇనాక్ గారిని జాతీయ కవి అంటారు. కథ, కవిత, వ్యాసం, నాటకం, నవల, పద్యం ఇలా ఆయన సాహిత్యంలో స్పృజించని అంశం లేదు. “అనంత జీవనం” జ్ఞాన్‌పీఠ్ వారి మూర్తిదేవి పురస్కారాన్ని పొందిన నవల. 29 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి తెలుగువారికి ఆ పురస్కారం రావడానికి హేతువైన నవల.
ఒకే ఒక సాహిత్య కారుడు ఏదో ఒక ప్రక్రియలో పేరు తెచ్చుకోవడం సాధ్యం కావచ్చు కానీ, ఒకే సారి పరిశోధన, సాహిత్య విమర్శ (వ్యాస రచన), కవిత్వం,పద్యాలు, నాటకం, నవల, కథలు, బాల సాహిత్యం, అనువాదాలు, ద్వి-బాషా రచనలు (హిందీ) ఇలా చాలా సాహిత్య ప్రక్రియల్లో పేరు చెచ్చుకోవడం, అవార్డులు సాధించడం అనేది ఒక్క ఇనాక్ గారికే చెల్లింది. 12 నవలలు, కథా సంపుతాలు 12, విమర్శ; 15 పుస్తకాలు ఇంగిలీషు నుండి తెలుగు కి అనువాదాలు 7. ఇంగ్లీష్ రచనలు 6 (కవిత్వం, నవల, నాటకం, జీవిత చరిత్రలు, స్వీయ జీవిత చరిత్ర) ఇంకా ఎన్నో పరిశోధనా వ్యాసాలు, విమర్శనాత్మక వ్యాసాలు. వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా, శ్రీ కృష్ణదేవరాయ కళాశాల అనంతపూర్ ప్రిన్సిపాల్ గా, ఎన్నో అధికార సంఘాల్లో సభ్యునిగా, అధ్యక్షునిగా ఎన్నో పదవులు అలంకరించారు.
ప్రముఖ కవులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ గుర్రం జాషువా లాంటి మహామహులతో అప్పట్లోనే మెప్పు పొందిన గొప్ప కవి ఇప్పుడు మనదగ్గరున్నాడు. ఆయన జీవితం మనకీ, మన రాబోయే తరాలకి స్ఫూర్తి. జీవితం లో నిలదొక్కుకోవడానికి ప్రతి క్షణం పోరాడి సాధించుకున్న జీవితం ఆ మహానుభావుడిది. ఎన్నో అత్యుత్తమ అవార్డులు తన స్వంతం చేసుకున్న ఆయన ఎలాంటి వివాదాలను తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. అలాంటి గొప్ప వ్యక్తిని మీకందరికీ పరిచయం చేసే అదృష్టం నాకు లభించినందుకు చాల సంతోష పడుతున్నాను. ఆ సాహిత్యపు గని తన అనుభవాలను మనతో పంచుకోవడానికి ఈ శనివారం లోటస్ టెంపుల్ మినీ హాలులో ముఖాముఖి ఏర్పాటు చేయబబడింది. అందరికేదే మా ఆహ్వానం.