తానా ఎలక్షన్స్ లో ఫౌండేషన్ ట్రస్టీ గా బరిలో ఉన్న శ్రీకాంత్ పోలవరపు డల్లాస్ ప్రాంతంలో తెలుగువారికి దశాబ్ద కాలానికి పైగా సుపరిచితుడు. మనిషి మృదుభాషే కానీ తానాలో క్రియాశీలకంగా సేవలందిస్తున్నారు. అన్ని తెలుగు సంఘాల నాయకులతో సత్సంబంధాలు నెరపడం తన సేవాతత్పరతకి నిదర్శనం. ప్రస్తుతం కూడా ఫౌండేషన్ ట్రస్టీగా పనిచేస్తున్న శ్రీకాంత్, నిరంజన్ ప్యానెల్ కి సైలెంట్ గా మద్దతుకూడగట్టే పనిలో ఉన్నారు.
2001లో అమెరికాకు వచ్చిన ఆయన 2003-2005 మధ్య ద్వైవార్షిక జీవిత కాల సభ్యుడిగా, 2005 నుండి శాశ్వత జీవిత కాల సభ్యుడిగా తానాలో కొనసాగుతున్నారు. డల్లాస్ తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందించిన ఆయన టీంస్క్వేర్ అధ్యక్ష, ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించి తానా బలోపేతానికి కృషి చేశారు. సహాయం చెయ్యాలి అనే ఆలోచనతోపాటు, తానాని విమర్శిస్తే ఫ్రెండ్స్ తోనైనా సుతిమెత్తగా గొడవపడటం తన నిబద్దతకి నిదర్శనం.
అమెరికాకు పర్యటకులుగా వచ్చే తల్లిదండ్రులకు వైద్య బీమా సౌకర్యం, ఆపదలో అన్నీ పోగొట్టుకున్న ఆపన్నులకు కాన్సులేట్లతో సమన్వయం, రహదారి ప్రమాదాల్లో మృతిచెందిన వారికి చేయూత వంటి ఎన్నో కార్యక్రమాలు తానా టీంస్క్వేర్ ద్వారా విజయవంతంగా నిర్వహించిన ఆయన ఈసారి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అందుకే తానా ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉన్నానని, సేవ చేయాలంటే ముందు ఎదుటివారి అవసరాలు క్షుణ్నంగా తెలిసి ఉండాలని, తనకు టీంస్క్వేర్తో పాటు తానా ఫౌండేషన్ ట్రస్టీగ గత రెండేళ్లుగా లభించిన అపరిమితమైన అనుభవాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహించే కార్యక్రమాల విస్తృతికి వినియోగిస్తానని ఆయన అంటున్నారు.