వాషింగ్టన్ డీ.సి మెట్రో ప్రాంతం: 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకు సిద్దమవుతున్న.. “బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం” కార్యవర్గం ఆధర్వర్యంలో సుమారు 1500 వందల మంది తెలుగు వారి సమక్షంలో పిక్నిక్, వన భోజనాల కార్యక్రమం, 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఉదయం 9 గంటల నుండి అల్పాహారం,కాఫీతో మొదలై.. అసలు సిసలు తెలుగింటి వంటకాలైన రాగి సంకటి, కోడి కూర, పూరి, పలావ్, కుర్మా లాంటి వంటలను అక్కడికక్కడే తయారు చేసి వేడి వేడిగా వడ్డించారు.. పూర్తిగా మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించగలిగామని GWTCS అధ్యక్షులు కృష్ణ లాం తెలిపారు.
చిన్నారులకు, మహిళలకు పలు ఆటల పోటీలు, ఫ్లాష్ మోబ్ లాంటి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రవాస భారతీయుల తల్లి దండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తానా (TANA) పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన (Satish Vemana) స్వయంగా రాగి సంకటి తయారు చేసి సందడి చేశారు.
ప్రతి సంవత్సరం ఇలా వన భోజనాలలో తెలుగువారందరిని ఆహ్లాదకరమైన వాతావరణంలో కలుసుకోవటం సంతోషమన్నారు. భారత, అమెరికా దేశాల సంబంధాలు మరింత బలపడాలని కోరుకున్నారు. మరో రెండు రోజుల్లో పిల్లలందరికీ పాఠశాలలు మొదలవుతుండటంతో విద్యార్ధులందరిని ఇష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు.
అనంతరం జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ మహనీయుల త్యాగఫలం భారత దేశ స్వాతంత్య్రం అని, అన్ని రంగాలలో దేశం పురోభివృద్ధి చెందాలన్నారు. రాబోయే సంవత్సరం GWTCS సంస్థ స్వర్ణోత్సవ వేడుకల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని పిలుపునిచ్చారు.
ఈనాటి కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో GWTCS కార్యవర్గ సభ్యులు, సంస్థ పూర్వ అధ్యక్షులు మరియు తానా కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు.