Connect with us

Celebrations

మేరిల్యాండ్లో NTR శతజయంతి ఉత్సవాలు, అమరావతికి కోటి రూపాయల విరాళం

Published

on

మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్ యడ్ల తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ హేమప్రసాద్ యడ్ల, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డాక్టర్ హేమప్రసాద్ యడ్ల మాట్లాడుతూ… చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, రాజధాని అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ప్రతి ప్రవాసాంధ్రుడు పనిచేయాలి. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏనాటికైనా తెలుగువారు అమెరికా అధ్యక్షులు కావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారన్నారు. ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… ఒక శకం ముగిసింది, ఒక తార రాలిపోయింది, ఒక గొంతు మూగబోయింది, ఒక తరం అంతరించిపోయింది. పీడిత జన హృదయాల్లో నుంచి ఉద్భవించిన నిలువెత్తు చైతన్యం. ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి అమరుడైన అన్న ఎన్టీఆర్ కు శత వసంతాల నీరాజనం. ఎన్టీఆర్ కాలాన్ని ప్రత్యేక యుగంగా , ఆయనొక యుగపురుషుడిగా తెలుగుసమాజం భావిస్తోంది. అందుకే ఆయన జీవితం అనేక యుగాల వారికి ఆదర్శమన్నారు.

మైనేని రాంప్రసాద్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ది మరణం లేని జననం, మరణించి జీవిస్తున్నారు. చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని అన్నారు. సుబ్బరాయుడు జక్కంపూడి మాట్లాడుతూ… పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని నింపిందన్నారు.

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి
రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం ద్వారా పేదవారికి అండగా నిలిచిన ఎన్టీఆర్ చరిత్ర అందరికీ మార్గదర్శకం. సినీ రంగంలో రారాజుగా వెలుగొందారు. జనం గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఈ వేదిక ద్వారా తీర్మానించడమైంది.

ఈ కార్యక్రమంలో జానకిరామ భోగినేని, ప్రసాద్ గనపనేని, శ్రీనాథ్ రావుల, శివ నెల్లూరి, భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, ఆంధ్రాబ్యాంక్ రామ్మోహన్ రావు, ఆకర్ష్ వలివేటి, శ్రీనాథ్ కాండ్రు, శ్రీనివాస్ పైడి, రాంబాబు యలమంచిలి, సుధీర్ నిమ్మగడ్డ, హేమంత్ కాలే, వేణు గోరంట్ల, సుందర్ క్రోసూరి, సీతారాం గంది తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ప్రముఖ గాయని కల్యాణి ద్విభాష్యం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected