ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి పట్టణానికి చెందిన, నాగ పద్మశ్రీ కోడూరు మరియు చంద్రశేఖర్ కోడూరు ల కుమారుడు తేజస్వి కోడూరు అమెరికాకి చెందిన వర్జీనియాలో థామస్ జఫర్సన్ హై స్కూల్ లో 12వ తరగతి చదువుతున్నాడు. ఇతను 2023 సంవత్సరానికి గాను సుప్రసిద్ధ యు.ఎస్ ప్రెసిడెన్షియల్ స్కాలర్స్ ప్రోగ్రామ్ ఫైనలిస్ట్లలో ఒకడిగా ఎంపికయ్యాడు.
అసలు ఈ U.S ప్రెసిడెన్షియల్ స్కాలర్స్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం ఏమిటి అని ఒకసారి పరిశీలిస్తే, దేశంలోని పాఠశాల విద్యార్థులను, వాళ్ళ విద్యాసంబంధమైన విజయాలను, నాయకత్వపు లక్షణాలను, మరియు వారి సమాజ సేవలను గుర్తించడానికి, 1964 లో ప్రారంభించబడింది. తరువాత, 1979లో ఈ కార్యక్రమాన్ని సృజనాత్మకమైన కళలలో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించడానికి, విస్తరించారు, తదనంతరం, 2015 లో ఈ కార్యక్రమాన్ని వృత్తి మరియు సాంకేతిక విద్యకు పొడిగించారు. ప్రతి సంవత్సరం హై స్కూల్ సీనియర్ తరగతుల నుండి 161 విద్యార్థులను ఎంపిక చేసి, వీరికి ప్రెసిడెన్షియల్ స్కాలర్స్ మెడల్ ని అందజేస్తారు.
ఈ విజయానికి దారితీసిన తేజస్వి ప్రయాణం థామస్ జెఫర్సన్ హైస్కూల్ లో చేరడంతో మొదలయింది. మొత్తం అమెరికాలో 3.7 మిలియన్ అనగా, 37 లక్షల మంది విద్యార్థులు ఈ సంవత్సరం హైస్కూల్ గ్రాడ్యుయేట్స్ అవుతుండగా, అందులోని 5 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం ఎన్నుకోబడ్డారు. ప్రముఖ విద్యావేత్తల ప్యానెల్ ఈ విద్యార్థుల సమర్పణలను సమీక్షించి 628మంది సెమీ ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు. ఆ తరువాత కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ స్కాలర్స్ కి సంబంధించి అమెరికా అద్యక్షునిచే నియమించబడిన 32 మంది ప్రముఖులు, 161 ఫైనలిస్టులను ఎంపిక చేశారు. U.S. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా 2023 సంవత్సరానికి గాను ఎంపిక కాబడిన 161 విద్యార్థులకి జూన్ ఆఖరి వారంలో అమెరికా అధ్యక్ష భవనం ఆయన వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చేతుల మీదగా పతకం బహుకరించబడుతుంది.
ఇంతటి ప్రతిష్టాత్మకం అయిన అవార్డుని తన తెలివితేటలతో సాధించిన తేజస్వి కోడూరు తను చదువుకుంటున్న థామస్ జెఫర్సన్ హై స్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరు నిలబెట్టాడు. ఈ సందర్భంగా తేజశ్వి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్, తెనాలికి చెందిన కోడూరు నాగ పద్మశ్రీ మరియు కోడూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంత ప్రఖ్యాతి గాంచిన కార్యక్రమంలో తమ కుమారుడు అగ్రభాగాన నిలవడం తమకు గర్వ కారణమని అన్నారు.
తేజశ్వి చిన్న వయసు నుండే చదువు తో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఎన్నో అవార్డులు సాధించాడు. తేజస్వి బాల్యం తెనాలి లో తన తాతయ్య, నాయనమ్మ, అయిన కోడూరు సాంబశివరావు, జయశ్రీ ల వద్ద గడిచింది. తన విద్యారంభం తెనాలి లోని గౌతమ్ పబ్లిక్ స్కూల్ లో మూడవ ఏట జరిగింది. ఆ తరువాత ప్రాధమిక విద్య మరియు ఉన్నత విద్య ని అమెరికా లో కొనసాగించాడు. ఎంతో పట్టుదలతో తేజస్వి చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని తల్లి దండ్రులతో పాటు తాతయ్య, నాయనమ్మ కోడూరు సాంబశివరావు, జయశ్రీ తెలిపారు. ఇంకా భవిష్యత్తులో తను మరిన్ని కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.