Connect with us

Cultural

TLCA@NY: అత్యద్భుతంగా ఉగాది & శ్రీరామనవమి వేడుకలు, తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం

Published

on

తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఉగాది (Ugadi) పండుగ తెలుగు వారికి అతి మక్కువైన పండుగ. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగంలా జరుపుకునే శ్రీరామ నవమి (Sri Rama Navami) కి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు మన తెలుగువారు.

మరి ఇంత పెద్ద పండుగలను అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంఘం అయిన తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) ఎలా నిర్వహించారు, న్యూ యార్క్, న్యూ జెర్సీ మరియు కనెక్టికట్ ప్రాంతాల్లోని తెలుగువారిని ఆహ్లాదపరిచారా లేదా తెలుసుకోవాలంటే వివరాలలోకి వెళ్లాల్సిందే.

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు శుభకృతంగా నిర్వహించారు. అధ్యక్షులు నెహ్రూ కఠారు (Nehru Kataru) మరియు ఛైర్మన్ డా. ప్రసాద్ అంకినీడు (Dr. Prasad Ankineedu) ఆధ్వర్యంలో ఏప్రిల్ 1, శనివారం రోజున పక్కా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

న్యూయార్క్ (New York) లోని స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (The Hindu Temple Society of North America) లో అశేష తెలుగు ప్రజల మధ్య నిర్వహించిన ఈ వేడుకలను గణపతి స్తోత్రంతో ప్రారంభించారు. మధ్యలో పండితులు పంచాంగ శ్రవణం గావిస్తుంటే అందరూ ఆసక్తిగా విన్నారు.

ప్రతి కార్యక్రమం కూడా వేటికవే సాటి అనేలా సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. తెలుగుభాషకి సంబంధించిన నాటికలు, శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి పాటలు మరియు నృత్యాలతో ఆద్యంతం వేదిక ప్రాంగణం హోరెత్తింది. కార్యక్రమాల వరుస కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా కల్చరల్ టీం చక్కని ప్రణాళికతో అందరినీ ఆహ్లాదపరిచారు.

పల్లె వాతావరణం, ఉగాది పండుగ సందర్భాన్ని కలగలిపి సుమారు 30 మంది పిల్లలు చేసిన ప్రోగ్రాం సందర్భానుచితంగా ఉంది. రామాయణాన్ని ఉటంకిస్తూ శ్రీ సీతారాముల అరణ్యవాసం, అనంతర పట్టాభిషేకం పై ప్రదర్శించిన నాటకం బహు బాగు. ‘పద్యానికి పట్టం’ కార్యక్రమం విషయంలో మాత్రం చిన్నారుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చిన్నారులు మన రూట్స్ మరిచిపోకుండా సాధన చేయించి అద్భుతంగా ప్రదర్శించారు.

ఇక ‘మాయాజూదం’ కార్యక్రమం అయితే స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. ఒక్కసారిగా అందరినీ మహాభారతం (Mahabharatam) లోని కౌరవుల మాయాజూదం, పాండవుల వనవాసం ఘట్టాలప్పటి కాలచక్రంలోకి తీసుకెళ్లారు. టి.ఎల్.సి.ఎ సభ్యులు ప్రతి పాత్రకి తగ్గ దేహ ధారుడ్యం, అలంకరణ, నటనతో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ధర్మరాజు, భీముడు వంటి పలు పాత్రలకు జీవం పోశారు.

వేదికపై నుండి అధ్యక్షులు నెహ్రూ కఠారు భోజనాలు ఎలా ఉన్నాయంటే సభికుల నుండి వచ్చిన రీసౌండింగ్ రెస్పాన్స్ వింటేనే తెలుస్తుంది భోజన కమిటీ ఎంత కష్టపడి ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా పండుగ భోజనం అందించారో. ఎప్పటిలానే డిజిటల్ స్క్రీన్, ఫోటో బూత్ రిచ్ లుక్ ని తీసుకొచ్చాయి. యాంకర్ వంశీ ప్రియ ధర్మరాజు (Vamsi Priya Dharmaraju) పదునైన వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు.

టి.ఎల్.సి.ఎ కార్యదర్శి డా. నాగేంద్ర గుప్త తన తోటి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees) లను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి, టి.ఎల్.సి.ఎ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ తెలుగు ఆర్గనైజషన్స్ అంటూ సంస్థ విశిష్టతను తెలియజేశారు.

ఈరోజు కార్యక్రమానికి ఉపాధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala) మరియు కార్యదర్శి సుమంత్ రాంశెట్టి (Sumanth Ramsetti) పనిచేసిన విధానాన్ని మెచ్చుకున్నారు. అనంతరం టి.ఎల్.సి.ఎ ఛైర్మన్ డా. ప్రసాద్ అంకినీడు మాట్లాడుతూ మన చిరకాల స్వప్నం టి.ఎల్.సి.ఎ కి సొంత భవనం సమకూర్చడం, ఈ దిశగా అందరూ విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఈ కార్యక్రమానికి అతిథిగా గా విచ్చేసిన ప్రముఖ నటి లయ (Actress Laya) ని డా. పూర్ణ అట్లూరి (Dr. Purna Atluri) మెమెంటోతో, అరుంధతి అడుప పుష్ప గుచ్ఛంతో, మాధవి కోరుకొండ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ టి.ఎల్.సి.ఎ కి రావడం ఇది మూడోసారని, ప్రతి సారి ఒక కొత్త అనుభూతిలా ఉందని అన్నారు.

లయ తను నటించిన స్వయంవరం చిత్రంలోని ‘కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం’ అంటూ పాట పాడి అందరినీ అలరించడం విశేషం. అలాగే మద్దిపట్ల ఫౌండేషన్ (Maddipatla Foundation) వారు సమర్పించిన ర్యాఫుల్ (Raful) బహుమతులను గెలుచుకున్నవారికి నటి లయ చేతులమీదుగా అందించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూ యార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ (Eric Adams) ని టి.ఎల్.సి.ఎ కార్యవర్గం మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానించి కారతాళ ధ్వనుల మధ్య సత్కరించారు. మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఉయ్ లవ్ న్యూ యార్క్ సిటీ అని రాసి ఉన్న ప్లకార్డ్ పట్టుకొని ప్రసంగించడం కొసమెరుపు.

మేయర్ ఎరిక్ ఆడమ్స్ (New York Mayor Eric Adams) మాట్లాడుతూ డైవర్సిటీ ఈస్ ది హాల్మార్క్ ఆఫ్ న్యూ యార్క్ సిటీ అంటూ భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మేయర్ ఎరిక్ ఆడమ్స్ కి తమ ఆహ్వానాన్ని మన్నించి తమ కార్యక్రమానికి విచ్చేసినందుకు టి.ఎల్.సి.ఎ అధ్యక్షులు నెహ్రూ కఠారు కృతఘ్నతాభినందనలు తెలిపారు.

ఈవెంట్ క్లైమాక్స్ లో టాలీవుడ్ (Tollywood) గాయనీగాయకులు సత్య యామిని (Satya Yamini) మరియు అనుదీప్ (Anudeep Dev) తమ ఎనర్జిటిక్ పాటలతో ఆహూతులందరినీ ఉర్రూతలూగించారు. పిల్లలు, పెద్దలు సైతం వేదికపైకి వెళ్లి డాన్స్ చేయడం విశేషం. ఈ సందర్భంగా టి.ఎల్.సి.ఎ కార్యవర్గం సత్య యామిని మరియు అనుదీప్ లను గౌరవంగా సన్మానించింది.

అత్యద్భుతంగా అందరినీ సమపాళ్లలో ఆహ్లాదపరిచి, భుక్తాయాసం కల్పించి, తెలుగువారి సంస్కృతీసంప్రదాయాల ఖ్యాతిని ఇనుమడింపచేసిన ఈ ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘాన్ని (TLCA) మరొక మెట్టు పైకెక్కించాయనడంలో అతిశయోక్తి లేదు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected