ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” అనే శీర్షికతో ప్రతినెలా ఆఖరిఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలలో భాగంగా “మన యువశక్తి – తెలుగు భాషానురక్తి” అనే అంశంపై గత ఆదివారం నిర్వహించిన 46వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశానికి విశేష స్పందన లభించింది.
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తన స్వాగతోపన్యాసంలో ఇంతమంది యువతీయువకులు ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం తెలుగుభాషను పరిరక్షించే ప్రయత్నం లో ఒక శుభ పరిణామమని, పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలికారు.
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ పిల్లలకు తెలుగు భాషపట్ల అనురక్తి బాల్యంనుంచి అమ్మవడిలో ప్రారంభమై, ఆతర్వాత బడిలో కొనసాగాలని, అందుకు తల్లిదండ్రులు తగుశ్రద్ధ తీసుకోవాలని, ప్రాధమికస్థాయి వరకు మాతృభాషలో విద్యాభోదన కల్పించ వలసిన భాద్యత ప్రభుత్వాలదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కుఅని, పసిప్రాయంలో మాతృభాషపై పట్టుసంపాదిస్తే ఆ తర్వాత ఎన్ని భాషలనైనా నేర్చుకోవడం సులభం అనేది చారిత్రాత్మిక సత్యం అన్నారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ ప్రవచనకారులు డా. గరికిపాటి గురజాడ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలఅవగాహన అంతా మాతృభాషపైనే ఆధారపడి ఉంటుందని, ఉగ్గుపాలనుండే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నచిన్న నీతి కధలతో భాషపట్ల అనురక్తి కల్గించాలని కోరారు. ఎం.ఏ తెలుగులో పిహెచ్.డి పట్టాను స్వర్ణ పతకంతో సహా సాధించిన ముఖ్యఅతిథిగా పాల్గొన్న డా. గరికిపాటి గురజాడను, ‘యాలైపూడ్సింది’ అనే గ్రంధానికి 2022 సంవత్సరానికిగాను “కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న, విశిష్ట అతిథి గా పాల్గొన్న పల్లిపట్టు నాగరాజును డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేకంగా అభినందించారు.
విశిష్ట అతిథులుగా వివిధ వయస్సులలోఉన్న యువతీయువకులు పాల్గొని తెలుగు భాషను ఎంతో మక్కువతో నేర్చుకుంటూ కవితా, కథా, శతక రచనలు, పద్యరచనలు, అవధానాలు, పద్యపఠనం మొదలైన ప్రక్రియలలో తమ ప్రతిభా విశేషాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్ధినుండి, కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వరకు అన్ని వయస్సుల్లో ఉన్నవారు, అన్ని ప్రాంతాలనుండి ముక్త కంఠంతో తెలుగు భాషా పరిరక్షణకు కట్టుబడిఉండడం హర్ష దాయకం అని తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు.