Connect with us

Concert

మంత్రముగ్ధుల్ని చేసిన అనూప్ రూబెన్స్ సంగీత విభావరి, టి.ఎల్.సి.ఎ దీపావళి వేడుకలు @ New York

Published

on

తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (Telugu Literary & Cultural Association – TLCA) వారి దీపావళి వేడుకలు న్యూయార్క్ లో నవంబర్ 13 ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. టి.ఎల్.సి.ఎ అధ్యక్షులు జయప్రకాశ్ ఇంజపురి (Jayaprakash Enjapuri) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీపావళి వేడుకలలో ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీత విభావరి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.

ఆహ్వానితులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపి దేవునిపాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక చిన్నారుల, పెద్దల సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ పాటలకు నృత్యాలు, అలాగే కూచిపూడి మరియు భరతనాట్యం నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తదనంతరం ఈ కార్యక్రమ సమర్పకులు డా. మల్లారెడ్డి, డా. పూర్ణ అట్లూరి, డా. మోహన్ బాధే, కృష్ణ మద్దిపట్ల తదితరులను శాలువా, పుష్పగుచ్ఛం మరియు మెమెంటోతో ఘనంగా సత్కరించారు. అలాగే న్యూయార్క్ మేయర్ (New York Mayor) పంపిన శుభాకాంక్షల సందేశంతో దీపావళి వేడుకలకు విచ్చేసిన న్యూ యార్క్ డెప్యూటీ మేయర్ దిలీప్ చౌహాన్ ని కూడా గౌరవపూర్వకంగా సత్కరించారు.

స్థానిక హిందూ టెంపుల్లో నిర్వహించిన ఈ టి.ఎల్.సి.ఎ దీపావళి వేడుకలలో ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ (Anup Rubens) సారధ్యంలోని గాయనీగాయకులు లిప్సిక, ధనుంజయ్, సాహితి, రోహిత్, రాపర్ రోల్ రీడా వారి మ్యూజికల్ నైట్ మరొక ఎత్తు.

సెట్ ది స్టేజ్ ఆన్ ఫైర్ అనేలా పోటాపోటీగా ప్రతి సింగర్ క్లాస్, మాస్ మరియు ట్రెండీ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనూప్ రూబెన్స్ అయితే ఏకంగా గిటార్ మరియు కీ బోర్డు పై చేసిన లైవ్ పెర్ఫార్మన్స్ కార్యక్రమాన్ని రక్తి కట్టించింది. అలాగే సమాయనుచితంగా మాటల గారడీతో యాంకర్ సమీరా అందరినీ అలరించింది.

న్యూయార్క్, న్యూ జెర్సీ మరియు కనెక్టికట్ ప్రాంతాల నుంచి అమితంగా పాల్గొన్న తెలుగువారు చివర్లో అనూప్ రూబెన్స్ ట్రూప్ కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటేనే తెలుస్తుంది ఈ తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) దీపావళి వేడుకలు ఎంత విజయవంతమయ్యాయో.

దీంతో తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం) కార్యనిర్వాహక సభ్యులు మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ గాయనీగాయకులు లిప్సిక, ధనుంజయ్, సాహితి, రోహిత్, రాపర్ రోల్ రీడా, యాంకర్ సమీరా మరియు అనూప్ రూబెన్స్ ని సత్కరించి అభినందించారు.

దుర్గా మాత విగ్రహంతో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ పండుగ వాతావరణాన్ని తెచ్చింది. ర్యాఫుల్ డ్రాస్ లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. మహిళామణులందరూ శోభాయమానంగా సాంప్రదాయ దుస్తులలో హాజరై కార్యక్రమానికి వన్నె తెచ్చారు.

2022 సంవత్సరం అంతా కూడా చక్కని కార్యక్రమాలతో టి.ఎల్.సి.ఎ ని ఒక మెట్టు పైకెక్కించిన అధ్యక్షులు జయప్రకాశ్ ఇంజపురి మరియు వారి సతీమణి కరుణ లను కొనియాడుతూ సత్కరించారు. అలాగే ప్రస్తుత ఉపాధ్యక్షులు నెహ్రూ కఠారు (Nehru Kataru) వచ్చే 2023వ సంవత్సరానికి అధ్యక్షునిగా ఎన్నికవడంతో తన సారధ్యంలోని 2023 కార్యనిర్వాహక సభ్యులు ప్రమాణ స్వీకారం గావించారు.

ఈ సంవత్సరం ప్రతి కార్యక్రమంలోనూ వెన్నంటి ఉండి విజయవంతం చేయడంలో సహకరించిన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) 2022 కార్యవర్గ సభ్యులందరినీ మెమెంటోలతో ప్రత్యేకంగా సత్కరించడం అభినందనీయం.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ (TANA), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ‘టిటిఏ’ (TTA) లీడర్షిప్ సభ్యులు కొంతమంది ఈ టి.ఎల్.సి.ఎ దీపావళి వేడుకలకు హాజరవడం విశేషం. రుచికరమైన పండుగ భోజనం అనంతరం అందరికీ కృతఙ్ఞతలు తెలపడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected